అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి

Published Tue, Apr 23 2024 8:40 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, చిత్రంలో కమిషనర్‌ మేఘ స్వరూప్‌  - Sakshi

అనంతపురం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ క్రమంలో అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎనికల అధికారి వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధత, పోస్టల్‌ బ్యాలెట్‌, తదితర అంశాలపై కసోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నగర పాలక కమిషనర్‌ మేఘస్వరూప్‌, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి నోడల్‌, జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహనతో ఉంటూ పనిచేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయించాలన్నారు. క్లిష్టమైన, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు లిఖితపూర్వకంగా అడిగితే ఇవ్వాలని ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులు తమ పరిధిలోని బృందాలతో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని కావాల్సిన వివరాలు, సమాచారం తెప్పించుకోవాలని సూచించారు. పోలింగ్‌ విధుల్లో ఉండే ఉద్యోగులందరూ తప్పకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంచుకోవాలని సూచించారు. ఈనెల 25న మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాలన్నారు. వేసవిలో పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, నోడల్‌ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

బాధ్యతగా పనిచేయాలి

ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ విషయంలో పోల్‌ టీమ్‌లది క్రియాశీల పాత్రన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియపై పోల్‌ టీమ్‌లకు సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశనిర్ధేశం చేశారు. 85 ఏళ్లు పైడిన వారికి, దివ్యాంగులకు హోమ్‌ ఓటింగ్‌కు సంబంధించి 13ఎ (డిక్లరేషన్‌), 13బి(బ్యాలెట్‌), 13సి (కవర్‌) ఉంటుందన్నారు. 13సి(కవర్‌)లో 13ఎ, 13బి ఉంటాయన్నారు. కవర్‌లో అవి రెండు ఉన్నప్పుడే అది వ్యాలీడ్‌ ఓటు అవుతుందన్నారు. ఎక్కడైనా ఓటు రికార్డు చేసేప్పుడు పోల్‌ ఆఫీసర్‌, పోలీసు అధికారి, వీడియో గ్రాఫర్‌, సూక్ష్మ పరిశీలకుడు ఉండాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక కమిషనర్‌ మేఘస్వరూప్‌, డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు, శిక్షణ అధికారులు రఘునాథ్‌రెడ్డి, బసవరాజు, పోల్‌టీమ్‌ అఽధికారులు పాల్గొన్నారు.

ఘనంగా రాములోరి కల్యాణోత్సవం

శింగనమల: శింగనమలలోని ఆత్మసీతారాముల కల్యాణోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి, కల్యాణం వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నేడు సంగమేశ్వరుడి రథోత్సవం

కూడేరు: దక్షిణ భారత దేఽశంలోనే పేరొందిన శైవక్షేత్రాల్లో ఒక్కటిగా నిలిచిన కూడేరులోని శివపార్వతుల జోడులింగాల సంగమేశ్వరుడి రథోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ రమేష్‌బాబు, ధర్మకర్త రామదుర్గం క్రిష్టప్ప సోమవారం తెలిపారు. ఈ నెల 23న ఉదయం 10.45 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 5.30 గంటలకు బ్రహ్మరథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.

పాల్గొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి
1/1

పాల్గొన్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి

Advertisement
Advertisement