అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.
ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.
అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్‌లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
దివ్యాంగులకు వాహన సదుపాయం...
దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.
పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా...
ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment