మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Sakshi
Sakshi News home page

మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Published Tue, Apr 9 2024 12:19 PM

Margadarsi Chit Fund Case: SC Key Comments On Ramoji Company - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్‌ చేస్తూ తీర్పు ఇచ్చింది. 

మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం  మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య  బెంచ్‌ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. 

.. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి  వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. 

ఏపీ వాదనలు: 

  • కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు
  • ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి


మార్గదర్శి వాదనలు:

  • 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు
  • అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము

సుప్రీం కోర్టులో ఉండవల్లి..  ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’.

‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు 

‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని  మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు

తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ..

తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే  నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు  ప్రయత్నం  విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్  తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

నేపథ్యం ఇదే..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది.

ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

గత విచారణే కీలకం
మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్‌ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని,  మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు..   కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు  చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఇంకోవైపు.. ఆర్‌బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.  డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు.

Advertisement
Advertisement