ఆసక్తికరం..రథం కథ | Sakshi
Sakshi News home page

ఆసక్తికరం..రథం కథ

Published Tue, Apr 23 2024 8:35 AM

కోదండరాముని రథం  - Sakshi

కడప కల్చరల్‌ : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఈశాన్యంలో ఎత్తయిన గదిలో రామయ్య రథాన్ని గమనించే ఉంటారు. మిగతా రోజుల్లో ఆ గదికే పరిమితమైనా బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు నెల రోజుల ముందునుంచి దానికి అవసరమైన మరమ్మతులు చేసి ఉత్సవాలకు అనువుగా తీర్చిదిద్దుతారు. కొత్త రంగులద్ది కళకళలాడేలా చేస్తారు. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. ఆ వివరాలు ఆలయం గోడపై శాసనం రూపంలో కనిపిస్తాయి.

ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించే రోజుల్లో బ్రహ్మోత్సవాల కోసం ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించారు. శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. తొలి బ్రహ్మోత్సవాల్లో వారు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు. ఇరు వర్గాల మధ్య రేగిన వివాదంతో రథోత్సవం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసి వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాల గురించి తెలుసుకున్నారు. రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. అప్పటి నుంచి ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కొలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కై ఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.

Advertisement
Advertisement