మద్యం షాపుల్లో చోరీ | Sakshi
Sakshi News home page

మద్యం షాపుల్లో చోరీ

Published Tue, Apr 23 2024 8:35 AM

-

సుజాతనగర్‌/అశ్వారావుపేటరూరల్‌ : మద్యం షాపుల్లో చోరీలు జరిగిన ఘటనలు సుజాతనగర్‌, అశ్వారావుపేటలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నాయి. సుజాతనగర్‌లోని వైన్‌షాపు షెట్టర్‌ పగలగొట్టిన ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి రెండు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇక అశ్వారావుపేటలోని మహాలక్ష్మి వైన్స్‌లో షెట్టర్‌ తాళం పలు మద్యం సీసాలను అపహరించారు. వాటి విలువ సుమారు రూ.95వేలు ఉంటుందని షాపు యజమాని నాచుపల్లి మల్లికార్జున్‌ ఫిర్యాదు చేశాడని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను తెలిపారు.

అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం

ములకలపల్లి: అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని రామాంజనేయపురంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవళ్ల వెంకటేష్‌ దంపతులు కూలీపనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. కాగా, సోమవారం వారు నివాసం ఉంటున్న పూరిల్లుకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంగానే నిత్యావసరాలు, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి.

21 కేజీల గంజాయి పట్టివేత

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని చెక్‌ పోస్టు వద్ద సోమవారం 21 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించామని, నిందితులు ఏపీలోని తిరువూరుకు చెందిన వారని, సీలేరు నుంచి తిరువూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డారని, గంజాయి విలువ రూ.5లక్షలు ఉంటుందని పట్టణ సీఐ సంజీవరావు వివరించారు.

చికిత్స పొందుతున్న కార్మికుడు మృతి

కొణిజర్ల: పంచాయతీ కార్యదర్శి వేఽధిస్తున్నాడని ఆరోపిస్తూ గతనెల 28న పురుగుల మందు తాగిన కార్మికుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందా డు. మండలంలోని అంజనాపురానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ భూక్యా ప్రసాద్‌ను కార్యదర్శి పనిలోకి రానివ్వడం లేదని చెబుతూ పురుగుల మందు తాగగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన సోమవారం మృతి చెందగా, ప్రసాద్‌ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు పోస్టుమార్టాన్ని అడ్డుకున్నారు. వైరా సీఐ సాగర్‌నాయక్‌, ఎస్‌ఐ శంకరరావు చేరుకుని ప్రసాద్‌ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement