Bank Deposits Growth Hit 6 Year High As Rs 2000 Notes Return In June, Says Report - Sakshi
Sakshi News home page

రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్‌: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్‌ డిపాజిట్లు

Published Wed, Jul 19 2023 11:42 AM

bank Deposits hit 6 year high as Rs 2000 notes return - Sakshi

ముంబై: ఆర్‌బీఐ రూ.2,000 నోటును ఉపసంహరిస్తున్నట్టు చేసిన ప్రకటన బ్యాంక్‌ డిపాజిట్లు భారీగా పెరిగేందుకు దారితీసింది. బ్యాంక్‌ డిపాజిట్లు ఆరేళ్ల గరిష్టానికి చేరి, జూన్‌ 30 నాటికి 191.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యవస్థలో రూ.2,000 నోటు రూపంలో మొత్తం రూ.3.62 లక్షల కోట్లు చెలామణిలో ఉండగా, ఇందులో 75 శాతానికి పైగా బ్యాంక్‌లోకి తిరిగొచ్చినట్టు ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ ప్రకటించడం గమనార్హం. అంటే రూ.2.7 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు కేవలం రూ.2,000 నోటు రూపంలోనే వచ్చినట్టు తెలుస్తోంది.

ఏడాదిలో చూసుకుంటే బ్యాంక్‌ డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.191.6 లక్షల కోట్లకు చేరినట్టు కేర్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌ తెలిపారు. 2017 మార్చి తర్వాత ఇదే గరిష్ట స్థాయి అని చెప్పారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడం, రూ.2,000 నోటు ఉపసంహరణ ఇందుకు మద్దతుగా నిలిచినట్టు తెలిపారు. డిపాజిట్లు, రుణాల మధ్య వ్యత్యాసం 3.26 శాతం మేర జూన్‌ 30తో ముగిసిన పక్షం రోజుల్లో తగ్గింది. మరోవైపు రుణాల్లో వృద్ధి 16.2 శాతంగా ఉంది.

ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్‌ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్‌

జూన్‌ 30తో ముగిసిన పక్షం రోజుల్లో రూ.143.9 లక్షల కోట్లకు రుణాలు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీ, వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి ఎక్కువ డిమాండ్‌ కనిపించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రుణ వితరణలో వృద్ధి 14.5 శాతంగానే ఉంది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాల (పీఎల్‌ఐ) మద్దతుతో మూలధన వ్యయాలు పెరుగుతుండడం, ఇక ముందూ రుణాలకు డిమాండ్‌ను నడిపిస్తుందని కేర్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 2023–24లో 13–13.5 శాతం వృద్ధి చెందొచ్చని పేర్కొంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement