ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ

Published Thu, Apr 25 2024 5:11 PM

Everest Not Banned Either Country Only One Out Of 60 Products Been Tested - Sakshi

ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ భారతీయ బ్రాండ్లకు చెందిన ప్రీ-ప్యాకేజ్డ్‌ స్పైస్‌ మిక్స్‌ ఉత్పత్తుల్లో పరిమితికి మించి ‘ఎథిలీన్‌ ఆక్సైడ్‌’ అనే పురుగుల మందు ఉన్నట్లు హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎవరెస్ట్‌ కంపెనీ స్పందించింది. తమ కంపెనీ తయారుచేస్తోన్న ఉత్పత్తులు భద్రమైనవని, నాణ్యతా ప్రమాణాలను పాటించే వాటిని తయారుచేస్తున్నట్లు స్పష్టం చేసింది.

సింగపూర్‌, హాంకాంగ్‌లో ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ కొన్నేళ్ల నుంచి వ్యాపారం సాగిస్తున్నాయి. ఏటా ఆయా కంపెనీల ఉత్పత్తులకు చెందిన శాంపిళ్లను అక్కడి ఫుడ్‌ సేఫ్టీ రెగ్యులేటర్‌ అయిన హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) పరీక్షిస్తోంది. అయితే ఇటీవల చేసిన పరీక్షల్లో ఆయా కంపెనీలు తయారుచేసిన ఉత్పత్తుల్లో ‘ఎథిలీన్‌ ఆక్సైడ్‌’ అనే పురుగుమందు వాడుతున్నట్లు నిర్ధారణ అయిందని, వాటిని నిషేధించినట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి. దాంతో ఎవరెస్ట్‌ కంపెనీ వివరణ ఇచ్చింది. అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించి తాము ఉత్పత్తులు తయారుచేస్తామని చెప్పింది. తమ ప్రొడక్ట్‌లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.

సింగపూర్‌, హాంకాంగ్‌లో ఎవరెస్ట్‌ ఉత్పత్తులు మొత్తం 60 ఉంటే, కేవలం ఒకదాన్నే పరీక్షించారని కంపెనీ వర్గాలు తెలిపాయి. అది కూడా ప్రామాణిక ప్రక్రియలోనే జరిగింది. కానీ ఎలాంటి నిషేధం మాత్రం విధించలేదని సంస్థ వివరించింది. ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఆహార భద్రత కంపెనీకి అత్యంత ప్రాధాన్యమన్నారు. స్పైస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ల్యాబ్‌ అనుమతి లభించాకే ఎగుమతులు జరుగుతాయని చెప్పారు.

హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఎస్‌) సదరు కంపెనీల ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సీఎఫ్‌ఎస్‌ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ రీకాల్‌ చేసింది. అందులో ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్‌, సాంబార్‌ మసాలా మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌, కర్రీ పౌడర్‌ మిక్స్‌డ్‌మసాలా పౌడర్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: గగనవీధిలో పెరుగుతున్న ప్రయాణికులు.. ఒకే రోజు భారీ రికార్డు..

ఆ రెండు తయారీ కంపెనీలపై చర్యలు తీసుకుందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముందస్తుగా ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌కు చెందిన అన్ని మసాలా దినుసుల తయారీ యూనిట్ల నుండి నమూనాలను సేకరించాలని ప్రభుత్వం ఫుడ్ కమిషనర్‌లను ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. అధికారులు ఎండీహెచ్‌, ఎవరెస్ట్ మాత్రమే కాకుండా అన్ని మసాలా తయారీ కంపెనీల నుంచి నమూనాలను తీసుకుని టెస్ట్‌ చేయనున్నట్లు తెలిసింది. దాదాపు 20 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామంటూ సంబంధిత అధికారులు వెల్లడించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement