ఎంతైనా ఇస్తాం.. ఓటేయండి? | Sakshi
Sakshi News home page

ఎంతైనా ఇస్తాం.. ఓటేయండి?

Published Mon, May 6 2024 4:25 AM

ఎంతైన

సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట : మేడమ్‌.. నేను గంటా అనుచరుడిని. మీ ఓటు మా గుర్తుకే పడాలి. మర్చిపోవద్దు. ఆల్రెడీ మీ ఫోన్‌ నంబర్లు తీసుకున్నాం కదా.. దానికి యూపీఐ పేమెంట్‌ చేసేశాను. ఏదో ఉడతాభక్తిగా ఇస్తున్నాం. ఏమీ అనుకోవద్దు..

సార్‌.. నమస్తే.. నేను వెలగపూడి మనిషిని. మీ ఓటు మాకు వెయ్యండి. మీ నంబర్‌ చెప్పండి సర్‌.. యూపీఐ పేమెంట్‌ చేస్తాను. అయ్యో మీ దగ్గర యూపీఐ లేదా.. ఇదిగోండి సర్‌.. ఈ డబ్బులు ఉంచండి. ప్లీజ్‌.. నమస్తే.. వెళ్లండి సర్‌.. వెళ్లండి.

ఇదీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో ఆదివారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వద్ద టీడీపీ నేతల పరిస్థితి.

ఎటు వెళ్లినా ఓటమి పవనాలు వీస్తుంటే.. టీడీపీ అభ్యర్థులకు దిక్కుతోచడం లేదు. గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న కొద్దీ.. అక్రమాలు, అడ్డగోలు పనులకు తెర తీస్తున్నారు. అడ్డదారులు తొక్కి ఎలాగైనా గెలవాలన్న దుర్బుద్ధితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కొందరు ఉద్యోగులు వద్దని వారిస్తున్నా.. వారి వెంట పడి మరీ తాయిలాలు అందించారు.

ఏయూ కాలేజీలో ఆదివారం ఉదయం నుంచి ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకూ ఎలాంటి ప్రచారాలు చేయకూడదని స్పష్టంగా తెలిసినా.. గంటా, వెలగపూడి అనుచరులు మాత్రం హల్‌చల్‌ చేశారు. ఓటర్లు వెళ్లే వైపు పెద్ద ఎత్తున గుమిగూడి తమకు ఎలాగైనా ఓటెయ్యాలంటూ ప్రాధేయ పడుతూ కనిపించారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని నిలిపేస్తూ.. తమ పార్టీకి ఓటెయ్యమంటూ ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. కొందరు ఓటర్లు.. వారి వైఖరికి విసుగు చెంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. మరికొందర్ని పక్కకి తీసుకెళ్లి మరీ.. వారికి బలవంతంగా తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి ఫోన్‌ నంబర్‌ కనుక్కోవడం వెంటనే గూగుల్‌ పే, ఫోన్‌ పే చెయ్యడం మొదలు పెట్టారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మా సంతృప్తి కోసం సర్‌.. మీరు వెళ్లి మాకే ఓటు వెయ్యండి అని సాగనంపుతూ కనిపించారు. మరికొందరికి యూపీఐ లేకపోతే. డబ్బులు చేతిలో పెట్టి.. వారిని కాళ్లావేళ్లా పట్టుకొని బతిమాలుతూ నానా హంగామా చేశారు.

దందాల గ్యాంగ్‌ మొత్తం అక్కడే..

ఏయూ ప్రాంగణంలో వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్‌, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ బొట్ట వెంకట రమణతో పాటు గంటా అనుచరులు పహారా కాశారు. ఉదయం నుంచి అక్కడే ఉంటూ వచ్చిన ప్రతి ఓటరునీ ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది చాలదన్నట్లుగా.. రెండు ప్రచార వాహనాల్ని అక్కడికి తీసుకొచ్చి నానా యాగీ చేశారు. పెద్ద పెద్ద సౌండ్స్‌తో టీడీపీ ప్రచార పాటలతో ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురిచేశారు. టీడీపీకి ఓటెయ్యాలంటూ దందాల గ్యాంగ్‌ అక్కడ హల్‌ చల్‌ చేస్తుండటంతో పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. చివరకు పోలీసులు అడ్డు చెప్పడంతో ఇన్‌ గేట్‌ వద్ద ఒక వాహనం, అవుట్‌ గేట్‌ వద్ద ఒక వాహనం నిలిపి తిరిగి మైక్‌లో పాట వేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను సజావుగా జరగకుండా అడుగడుగునా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సమాయత్తమవుతోంది.

ఏయూలో గంటా, వెలగపూడి బ్యాచ్‌ హల్‌చల్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సమయంలో ప్రలోభాలు

నగదు, యూపీఐ పేమెంట్లతో ఓటర్లకు గాలం

ప్రచార రథాలతో ఎన్నికల ప్రవర్తన

నియమావళికి తూట్లు

ఎంతైనా ఇస్తాం.. ఓటేయండి?
1/2

ఎంతైనా ఇస్తాం.. ఓటేయండి?

ఎంతైనా ఇస్తాం.. ఓటేయండి?
2/2

ఎంతైనా ఇస్తాం.. ఓటేయండి?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement