వందేళ్ల నాటి చట్టాలతో ఏళ్ల తరబడి భూ వివాదాలు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక మహత్తర చట్టం
వివాదాలు లేకుండా భూ యజమానులకు శాశ్వత హక్కులు
సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లడం తగదు
అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య అన్నారు. ఆయన ఆదివారం గుంటూరులోని ఐటీసీ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వందేళ్ల కిందట బ్రిటీష్‌కాలంలో భూముల సర్వే చేశారని, అనంతరం మళ్లీ సమగ్రమైన సర్వే జరగలేదని చెప్పారు.
భూ యాజమాన్య హక్కులు, హద్దులపై రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో వేలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భూ వివాదాలతో ప్రజలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో సమగ్ర భూసర్వే ద్వారా భూములకు యజమానులను గుర్తించి, సంబంధిత భూములపై వారికే శాశ్వతరీతిలో హక్కులను కల్పించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ అనే మహత్తరమైన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు.
భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించి, యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడంతోపాటు డిజిటల్ రికార్డుల రూపంలో వాటిని భద్రపర్చడం ఎంతో గొప్ప కార్యక్రమమని చెప్పారు. గత ప్రభుత్వాలే కాకుండా దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని వివరించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రాజకీయ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టడం, సీఎం జగన్‌పై బురదచల్లడం తగదన్నారు.
అడ్డగోలుగా ఫిలిం సిటీ కట్టిన రామోజీ
రైతుల భూములు ఆక్రమించి అడ్డగోలుగా ఫిలిం సిటీని నిర్మించిన రామోజీరావు తన ఈనాడు పత్రిక ద్వారా నిత్యం తప్పుడు వార్తలు రాస్తూ సీఎం వైఎస్ జగన్‌పై అభాండాలు వేస్తున్నారని జస్టిస్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల భూములు లాగేసుకుంటారంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్న రామోజీరావు... గతంలో రామోజీ ఫిలింసిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు జడ్జిగా తాను స్టే ఇచ్చిన విషయం మరిచారా.. అని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ, జనసేనలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు.
బీసీ విద్యార్థులకు న్యాయంచేసిన సీఎం జగన్
వైద్య విద్య సీట్ల కేటాయింపులో సీఎం జగన్ బీసీ విద్యార్థులకు న్యాయంచేశారని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. బీసీ కోటాలో సీటు పొంది, ఓపెన్ మెరిట్‌లోకి వెళ్లిన విద్యార్థుల సీట్లను తిరిగి బీసీ కోటాలోనే భర్తీచేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గత ప్రభుత్వంలో చంద్రబాబు అమలు చేయలేదన్నారు. ఫలితంగా బీసీ కోటాలో ఏటా దాదాపు 500 ఎంబీబీఎస్ సీట్లను బీసీ విద్యార్థులు కోల్పోతున్న విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా... బీసీ కోటా సీట్లు బీసీ విద్యార్థులతోనే భర్తీ చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వడంతోపాటు సక్రమంగా అమలు చేయిస్తున్నారని వివరించారు.
బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం జగన్‌కు బీసీలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నవేనని, అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగాలంటే వైఎస్ జగన్ సీఎంగా ఉండాలని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టంచేశారు. హైకోర్టు న్యాయవాది ఠాగూర్ యాదవ్, ప్రభుత్వ మాజీ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు, బీసీ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment