ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం జూమ్‌.. భారీగా పెరిగిన ఆదాయం | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం జూమ్‌.. భారీగా పెరిగిన ఆదాయం

Published Wed, Jul 19 2023 7:32 AM

IndusInd Bank Q1 Results Net profit jumps - Sakshi

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్‌చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది.

ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది.

ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది.

Advertisement
Advertisement