టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్
నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులు
దర్శకత్వం: మేఖేల్ చావ్స్
నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
హారర్ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్ మాత్రం అలాంటి హారర్ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.
హాలీవుడ్‌లో హారర్ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది.
ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.
డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్ సీన్స్‌ను డైరెక్టర్ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి.
Comments
Please login to add a commentAdd a comment