స్కేరీ హౌస్
అమెరికా... 2013... ‘ద కన్జ్యూరింగ్’ సినిమా షూటింగ్ స్పాట్...
‘‘ఏంటిది వెరా... ఇక్కడికొచ్చి స్క్రిప్ట్ చదివితే ఎలా? ఇంటికి తీసుకెళ్లి చదివేసి ఉంటే ఈ టైమ్ సేవ్ అయ్యేది కదా’’... విసుగ్గా అన్నాడు డెరైక్టర్ జేమ్స్ వాన్.
వెరా నుదురు చిట్లించింది. ‘‘సారీ సర్... కావాలంటే రేపట్నుంచి ఇంకాస్త త్వరగా వచ్చి డైలాగ్స నేర్చుకుంటాను. అంతేకానీ స్క్రిప్టు ఇంటికి తీసుకెళ్లను.’’
‘‘తీసుకెళ్లడానికేంటి సమస్య?’’
వెరా క్షణంపాటు తటపటాయించి అంది... ‘‘ఇంతకుముందు తీసుకెళ్లాను. అప్పుడేం జరిగిందో చెబితే నమ్మలేరు. స్క్రిప్టు చదవడం మొదలుపెట్టగానే నాకు తలనొప్పి మొదలవుతోంది. కాసేపటికి తల పగిలిపోయేంతగా వస్తుంది నొప్పి. స్క్రిప్టు పక్కన పడేయగానే మంత్రం వేసినట్టుగా ఆగిపోతుంది. అంతే కాదు.. చదువుతున్నంతసేపూ గుండె పట్టేసినట్టు, ఊపిరి ఆగిపోతున్నట్టు... ఏదేదో అవుతోంది.’’
అప్పుడే వచ్చిన ప్యాట్రిక్, వెరా మాటలు విని నవ్వాడు. ‘‘మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు వెరా. స్క్రిప్టుకీ దానికీ సంబంధమేంటసలు? అదంతా నీ భ్రమ. ఏమంటారు డెరైక్టర్గారూ?’’
వాన్ మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్టు అతడి నుదుటిమీద పడిన మడతలు చెబుతున్నాయి. ఆ ఆలోచనల తీవ్రతను తెలుపుతూ పెదవులు బిగుసుకుంటున్నాయి.
‘‘ఏంటి వాన్.. తన మాటలు నమ్మేస్తున్నారా ఏంటి కొంపదీసి?’’ అన్నాడు ప్యాట్రిక్ నవ్వుతూ.
‘‘నమ్మక తప్పదు. ఎందుకంటే... ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నుంచీ నాకూ ఇలాంటివే జరుగుతున్నాయి. రాత్రంతా కుక్క అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి నాకు. మా ఇంట్లో కుక్క లేదు. చుట్టుపక్కల వాళ్లెవ రూ కూడా కుక్కను పెంచుకోవడం లేదు. మరి ఆ అరుపులెక్కడివి?’’
‘‘ఓహ్ మిస్టర్ వాన్... మీరు కూడా ఏంటి? నిన్నంతా మనం కుక్క సన్నివేశాలు షూట్ చేశాం కదా. అందుకే మీకు అలా అనిపించి ఉంటుంది. లైట్ తీసుకోండి’’ అంటూ వెళ్లిపోయాడు ప్యాట్రిక్.
కానీ వాన్ లైట్‌గా తీసుకోలేకపోయాడు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచీ ఏవేవో జరుగుతూనే ఉన్నాయి. సెట్లో పెట్టిన వస్తువు పెట్టినట్టు ఉండటం లేదు. లైట్లు ఆన్ చేయకుండా లైటింగ్ వస్తూంటుంది. ఉన్నట్టుండి వాతావరణం చల్లగా అయిపోతుంది. అది కూడా... తాను ఎవరి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాడో, ఆ వ్యక్తులు స్పాట్‌కి వచ్చినప్పుడు. ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు అనిపించడం లేదు.
‘‘ప్యాట్రిక్ చెప్పినట్టు ఇది భ్రమేనంటారా?’’... అనుమానంగా అంది వెరా.
‘‘లేదు వెరా... ఇది భ్రమ కాదు. హారర్ సినిమాలు తీయడం నాకు కొత్త కాదు. కానీ ఎప్పుడూ ఇలా అవలేదు. పెరాన్ ఫ్యామిలీకి ఎదురైన అనుభవాలని సినిమాగా తీస్తున్నాను. ఆ అనుభవాలు చాలా భయంకరమైనవి. వాటి ప్రభావం ఏమైనా ఉందా అని అనుమానం వస్తోంది ఒక్కోసారి’’ అంటూ మళ్లీ ఆలోచనల్లోకి జారిపోయాడు వాన్. నిజమే. పెరాన్ కుటుంబం ఎదుర్కొన్న అనుభవాలు సామాన్యమైనవి కావు. వాటిని విన్న గుండె భయంతో వణుకక మానదు.
1970... రోడ్ ఐల్యాండ్‌లోని ఓల్డ్ ఆర్నాల్డ్ ఎస్టేట్...
‘‘కమాన్ స్నూపీ... కమాన్’’... కుక్కను బలవంతంగా లోనికి లాగుతోంది సిండీ. కానీ అది కదలడం లేదు.
‘‘చూడు డాడీ... ఇది లోపలికి రావట్లేదు’’ అంది సిండీ బుంగమూతి పెట్టి. సామాన్లు లోపల పెడుతోన్న రోజర్ పెరాన్ స్నూపీ వైపు చూశాడు. అది మొరాయిస్తోంది.
‘‘వదిలెయ్ బేబీ... కొత్త ఇల్లు కదా, అందుకే అలా చేస్తోంది. వస్తుందిలే’’ అంటూ లోనికి వెళ్లిపోయాడు.
‘‘బ్యాడ్ స్నూపీ’’ అనేసి తనూ లోపలికి వెళ్లిపోయింది సిండీ. వెళ్తూనే తల్లి క్యారొలీన్ దగ్గరకు పరుగెత్తింది. ‘‘మమ్మీ... స్నూపీ లోపలికి రావడం లేదు’’ అంటూ కంప్లయింట్ చేసింది. ‘‘దాని గురించి బెంగపడకు బేబీ... నువ్వు అక్కయ్యవాళ్లతో వెళ్లి నీ రూమ్ చూసుకో’’ అందామె నవ్వుతూ.
ఎక్కడలేని హుషారూ వచ్చేసింది సిండీకి. స్నూపీ సంగతి మర్చిపోయి గబగబా అక్కల దగ్గరకు వెళ్లిపోయింది. పాప సంబరం చూసి నవ్వుకుంది క్యారొలీన్. ప్రాణంగా ప్రేమించే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఈ డ్రీమ్హౌజ్లో కొత్త జీవితం... చాలా ఆనందంగా ఉంది క్యారొలీన్. కానీ పాపం తనకి తెలీదు... ఆ ఆనందం కొద్ది గంటలు కూడా నిలబడదని!
తర్వాతి రోజు ఉదయం...
‘‘మమ్మీ... డాడీ...’’.. సిండీ అరుపుతో ఉలిక్కిపడి బయటకు పరుగెత్తారు రోజర్, క్యారొలీన్. సిండీ వెక్కి వెక్కి ఏడుస్తోంది. తనకి ఎదురుగా స్నూపీ పడివుంది... నిర్జీవంగా. రోజర్ పరుగున వెళ్లి స్నూపీని పరిశీలించాడు. ప్రాణం లేదు.
‘‘ఏంటిది రోజర్... నిన్న సాయంత్రం వరకూ బాగానే ఉంది కదా’’... దిగులుగా అంది క్యారొలీన్. అంతలో మిగతా నలుగురు పిల్లలూ వచ్చారు. స్నూపీని చూసి ఏడుపందుకున్నారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్నూపీని తీసుకొచ్చాడు రోజర్. అదంటే పిల్లలకు చాలా ఇష్టం. ముఖ్యంగా నాలుగో అమ్మాయి సిండీ ఎప్పుడూ దానితోనే ఆడుకుంటుంది. దానికిలా అవడం అందరికీ బాధగానే ఉంది. ఏడుస్తూనే గొయ్యి తీసి స్నూపీని పాతిపెట్టారు.
అది మొదలు... సంతోషమన్నది వాళ్ల దరికి వచ్చింది లేదు. రోజర్ దంపతులు ఒక గదిలో, పెద్దమ్మాయి ఆండ్రియా ఒక గదిలో, నాన్సీ-క్రిస్టీనాలు మరో గదిలో, సిండీ-ఏప్రిల్‌లు ఇంకో గదిలో పడుకునేవారు. రాత్రిళ్లు ఉన్నట్టుండి పిల్లల గదుల నుంచి కేకలు వినిపించేవి. వెళ్లి చూస్తే పిల్లలు ఎవరో ఈడ్చుతున్నట్టుగా నేలమీద పొర్లేవారు. గోడలకు గుద్దుకునేవారు. ఎవరో జుట్టు పట్టి లాగుతున్నారంటూ ఏడ్చేవారు. వాళ్లు గదిలో ఉన్నప్పుడు ఎవరో బయట తాళం వేసేసేవారు. సెల్లార్లోకి వెళ్లినప్పుడు తలుపులు మూసేసేవారు. ఉండేకొద్దీ క్యారొలీన్కు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవసాగాయి.
హ్యారిస్విల్ హౌస్‌ని మొదట రీమోడల్ చేయాలనుకున్నాడు రోజర్. కానీ అది సాధ్యపడలేదు. పని చేయడానికి వచ్చినవారిని సైతం దెయ్యాలు బెదరగొట్టడంతో పనివాళ్లు బెదిరిపోయేవారు. దాంతో ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు కానీ, తర్వాత ఒకరు కొనుకున్నారు. వారు కూడా ఇలాగే ఇబ్బందులు పడి మరొకరికి అమ్మేశారు. వారి పరిస్థితీ అంతే. ఇలా ఆ ఇల్లు చేతులు మారింది తప్ప, ఆ ఇంటిలో ఉన్న ఆత్మలను మాత్రం ఎవ్వరూ వెళ్లగొట్టలేకపోయారు.
ఓరోజు ఉదయం ఆమె కళ్లు తెరిచేసరికి ఎదురుగా ఓ మహిళ ఉంది. గ్రే కలర్ గౌను వేసుకుని, జుట్టు విరబోసుకుని వుంది. ‘ఇక్కడ్నుంచి వెళ్లిపో. లేదంటే నిన్ను చంపేస్తాను’ అని బెదిరించి మాయమైపోయింది. షాకైపోయింది క్యారొలీన్. ఆ క్షణం నుంచీ ఆమె జీవితం నరకమైపోయింది. ఒంటరిగా పని చేసుకుంటున్నప్పుడు ఎవరో చెంప మీద ఛెళ్లున కొట్టేవారు. వెనుక నుంచి తోసేవారు. గిన్నెలు, గరిటెల్ని మీదికి విసిరేవారు. పిల్లలు పిలిచినట్టుగా పిలిచేవారు. వెళ్తే గదిలో బంధించేసేవారు. మాటిమాటికీ ఓ మహిళ స్వరం.. ఇల్లు వదిలి వెళ్లమంటూ బెదిరిస్తూ ఉండేది. ఓసారి సోఫాలో నిద్రపోతుంటే తొడలో తీవ్రమైన నొప్పి మొదలైంది. చూస్తే ఓ పెద్ద సూది తొడలోకి దిగివుంది. రక్తం కారిపోతోంది. హతాశురాలైందామె.
తన భార్య, పిల్లలు పడుతున్న బాధ చూడలేక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్ వారెన్, లోరైన్ వారెన్లకు కబురు చేశాడు రోజర్. వాళ్లు కొన్నేళ్లుగా దెయ్యాల మీద పరిశోధనలు చేస్తున్నారు. ఎన్నోచోట్ల దురాత్మలను వెళ్లగొట్టారు. ఆ అనుభవంతోనే... రోజర్ ఇంట్లో ఒకటీ రెండూ కాదు, ఎన్నో దురాత్మలున్నాయని కనిపెట్టారు. వాటన్నిటిలో ముఖ్యమైనది... బెత్షెబా ఆత్మ. బెత్షెబా ఆ ఇంట్లోనే ఉండేది. అతీంద్రియ శక్తుల్ని పొందాలని పూజలు చేసేది. దానికోసం తన నాలుగేళ్ల కూతుర్ని సైతం బలి ఇచ్చింది.
ఆ పాప ఆత్మ కూడా అక్కడే సంచరిస్తోంది. తను ఏడుస్తూ ఇల్లంతా తిరగడం క్యారొలీన్ గమనించింది. ఒకసారి ఓ గదిలోకి వెళ్లేసరికి కుర్చీలో ఓ మహిళ, ఆమె ఒడిలో ఓ పాప కూర్చుని ఉండటం కూడా చూసింది. వాళ్లెవరో అప్పుడు తెలిసొచ్చిందామెకి. ఇంట్లో ఉన్న ఇతర ఆత్మలన్నీ ఆ ఇంట్లో ఇంతకు ముందు నివసించినవారేనని, వాళ్లందరూ బెత్షెబా వల్లే మరణించారని కూడా తెలిసింది. విచిత్రమేమిటంటే... బెత్షెబా రోజర్ని మాత్రం ఇబ్బంది పెట్టేది కాదు.
పైగా ప్రేమ చూపించేది. తాకడం, తల నిమిరడం చేసేది. దాన్నిబట్టి ఆమె రోజర్ మీద ఆశపడిందని, అందుకే క్యారొలీన్ను బయటకు గెంటివేయాలని చూస్తోందని ఇన్వెస్టిగేటర్లు ఊహించారు. ఆమె ఆత్మను వెళ్లగొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. తనను వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలియగానే బెత్షెబా రెచ్చిపోయింది. క్యారొలీన్ను గోడకేసి కొట్టింది. ఒక గదిలోంచి మరో గదిలోకి విసిరేసింది. తట్టుకోలేకపోయిన రోజర్ ఇన్వెస్టిగేటర్లను వెళ్లిపొమ్మన్నాడు. భార్యని, పిల్లల్ని తీసుకుని వేరే చోటికి వెళ్లిపోయాడు.
రోజర్ కుటుంబం ఎదుర్కొన్న ఈ అనుభవాల గురించి అప్పట్లో పలు పేపర్లలో కథనాలు వెలువడ్డాయి. కొందరు నమ్మారు. కొందరు కట్టుకథలన్నారు. కానీ అవి కథలు కాదు నిజాలేనని ఎడ్, లోరైన్లు కుండ బద్దలుకొట్టారు. దానికి తోడు కొన్నాళ్లు గడిచిన తర్వాత రోజర్ పెద్ద కూతురు ఆండ్రియా హ్యారిస్విల్ హౌస్‌లో హింసను తెలుపుతూ ‘ద హౌస్ ఆఫ్ ద డార్క్నెస్ ద హౌస్ ఆఫ్ లైట్’ అనే పుస్తకం రాసింది. దాన్ని చదివినవాళ్లకి నిజాలు కళ్లకు కట్టాయి.
ఆ సంఘటనలన్నింటినీ కూర్చి ‘ద కన్జ్యూరింగ్’ సినిమా తీశాడు దర్శకుడు జేమ్స్ వాన్. షూటింగ్ జరుగుతున్నన్నాళ్లూ సెట్లోను, చిత్రం సిబ్బంది జీవితాల్లోనూ కూడా చిత్రమైన సంఘటనలు జరిగాయి. ఎలాగో సినిమా పూర్తయ్యింది. విజయఢంకా మోగించింది. అందులోని దృశ్యాలన్నీ ఒకరి జీవితంలో నిజంగా జరిగినవేనని తెలిసి ప్రేక్షకులు హడలిపోయారు. ఇంత నరకం మరెవరూ చూడకూడదని మనసారా కోరుకున్నారు!
- సమీర నేలపూడి