ఎన్నో రకాల రెసిపీలు గురించి విని ఉంటారు. అత్యంత వ్యవధి తీసుకున్న రెసీపీలు కూడా చూశాం. వాటన్నింటిని కాలదన్నేలా కఠినమైన రెసిపీ గురించి మాత్రం విని ఉండదరు. అయితే దీనిని వేటితో తయారు చేస్తారో వింటే మాత్రం కంగుతింటారు.
ఏదో మాట వరసకు మంచి జీర్ణశక్తి గలవారిని రాళ్లను హరాయించుకోగలరు అంటారు గాని, ఎంతటి జీర్ణశక్తిమంతులకైనా ఈ వంటకాన్ని ఆరగించడం సవాలే! ‘సువోడియు’ అనే ఈ చైనీస్ వంటకంలోని ప్రధాన పదార్థం నది ఒడ్డున దొరికే నున్నని గులకరాళ్లే! గులకరాళ్లను మూకుడులో వేసి, బాగా వేయించి, వాటికి వెల్లుల్లి, మిరపకాయలు సహా రకరకాల మసాలాలు జోడించి తయారు చేస్తారు.
కాస్త జారుగా సూప్‌లా ఉండే ఈ వంటకాన్ని కొన్ని శతాబ్దాల కిందట నది మధ్యలో చిక్కుకుపోయిన ఓడ సరంగులు కనిపెట్టారట! ఈ వంటకంలోని సూప్‌లాంటి జారుడు ద్రవాన్ని జుర్రుకుని, ఇందులోని రాళ్లకు పట్టిన మసాలాలను నిదానంగా చప్పరించి, ఆనక ఆ రాళ్లను ఊసేయాలి. నిజానికి ఈ వంటకాన్ని ఆరగించడమే ఒక కళ! ‘సువోడియు’ చైనాలో చాలా చోట్ల వీథుల్లో అమ్ముతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకంగా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment