ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా నిన్న (మే 4) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన విరాట్.. పొట్టి క్రికెట్‌లో 12500 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఐపీఎల్ గెలుపుల్లో అత్యధిక పరుగులు (4039) చేసిన బ్యాటర్‌గా.. నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
క్రిస్ గేల్ (14562)
షోయబ్ మాలిక్ (13360)
కీరన్ పోలార్డ్ (12900)
విరాట్ కోహ్లి (12536)
అలెక్స్ హేల్స్ (12319)
విజయాల్లో (ఐపీఎల్) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లి (4039)
శిఖర్ ధవన్ (3945)
రోహిత్ శర్మ (3918)
డేవిడ్ వార్నర్ (3710)
సురేశ్ రైనా (3559)
మ్యాచ్ విషయానికొస్తే.. విరాట్, డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో షారుక్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్ (30), రాహుల్ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్ శర్మ, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది.
అయితే దినేశ్ కార్తీక్ (21 నాటౌట్).. సప్నిల్ సింగ్ (15 నాటౌట్) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో జాషువ లిటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment