బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణంగా విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మరో అవమానం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 27వ స్థానానికి పడిపోయాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-25 లోనుంచి బయటికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇది మొదటిసారి. కెరీర్ ఆరంభంలో మాత్రమే విరాట్ టాప్-25 బ్యాటర్ల జాబితాలో లేడు. 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విరాట్.. 2012లో ఓసారి 36వ స్థానానికి పడిపోయాడు.
బీజీటీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో విరాట్ కేవలం 23 పరుగులు (17, 6) మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం విరాట్ మూడు స్థానాలు కోల్పోయి ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 614 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి.
బీజీటీ ఆధ్యాంతం దారుణంగా విఫలమైన విరాట్ ఈ సిరీస్ మొత్తంలో (9 ఇన్నింగ్స్‌ల్లో) 190 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ తన సమకాలీకులైన జో రూట్ (నంబర్ వన్ ర్యాంక్), కేన్ విలియమ్సన్ (మూడో ర్యాంక్), స్టీవ్ స్మిత్ (ఎనిమిదో ర్యాంక్), బాబర్ ఆజమ్ (12వ ర్యాంక్) కంటే చాలా వెనుకపడ్డాడు.
2018 ఆగస్ట్‌లో కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు (937) సాధించి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విరాట్.. 2020 ఫిబ్రవరిలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కెరీర్ పీక్స్‌లో (2016-2020) ఉండగా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ ప్రస్తుతం గుడ్డకాలం ఎదుర్కొంటున్నాడు.
2024లో ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేసిన విరాట్.. గతేడాది మూడు ఫార్మాట్లలో చెత్త ప్రదర్శనలు చేశాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటున 655 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కెరీర్ మొత్తంలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఇంత దారుణమైన ప్రదర్శనలు ఎప్పుడూ లేవు.
తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ కూడా పడిపోయారు. గిల్ మూడు స్థానాలు కోల్పోయి 23వ స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 42వ ప్లేస్‌కు దిగజారాడు.
ఆసీస్‌తో చివరి టెస్ట్‌లో కోహ్లి, రోహిత్‌తో పాటు విఫలమైన రాహుల్ 11 స్థానాలు కోల్పోయి 52వ స్థానానికి పడిపోయాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయిన నితీశ్ కుమార్.. సిడ్నీ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనలు చేసి 19 స్థానాలు కోల్పోయాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో నితీశ్ 72వ స్థానానికి పడిపోయాడు.
తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు అర్ద శతకం చేసిన రిషబ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్, పంత్ మాత్రమే ఉన్నారు.
ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు.
తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment