వన్డేల్లో 300 పైచిలుకు స్కోర్లు కొత్తగా ఛేదించబడుతున్న రోజులవి. అప్పటిదాకా అడపాదడపా మాత్రమే ఈ స్థాయి లక్ష్యాలు ఛేదించబడేవి. 2006లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా (435 పరుగుల లక్ష్యం).. 2007లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ (347) 300 ప్లస్ స్కోర్లను ఛేదించాయి.
2013లో భారత్ ప్రపంచం మొత్తం దిమ్మతిరిగిపోయేలా ఏకంగా 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. 2013 అక్టోబర్ 16న జైపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎవరూ ఊహించని విధంగా 360 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత వన్డే క్రికెట్ చరిత్రలో నేటి వరకు ఇదే అత్యుత్తమ ఛేదన.
నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), ఫిల్ హ్యూస్ (103 బంతుల్లో 83; 8 ఫోర్లు, సిక్స్), షేన్ వాట్సన్ (53 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జ్ బెయిలీ (50 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 53; 7 ఫోర్లు, సిక్స్) అర్దసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 2, అశ్విన్ ఓ వికెట్ తీయగా.. ఫించ్, మ్యాక్స్‌వెల్ రనౌట్లయ్యారు.
అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రోహిత్ శర్మ (123 బంతుల్లో 141 నాటౌట్; 17 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధవన్ (86 బంతుల్లో 95: 14 ఫోర్లు), విరాట్ కోహ్లి (52 బంతుల్లో 100 నాటౌట్: 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మరో 39 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటింగ్ త్రయం ధాటికి ఆసీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ముఖ్యంగా విరాట్ ఆసీస్ బౌలర్లను తుత్తునియలు చేశాడు. ఈ విజయం భారత వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే 400కు పైగా స్కోర్ చేసుండేది.
Comments
Please login to add a commentAdd a comment