ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది.
మరోపక్క భారత్ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్.. బీజీటీలో ఒక్క మ్యాచ్ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ (న్యూజిలాండ్ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది.
బీజీటీ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.
మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
మూడో స్థానానికి పడిపోయిన భారత్ 109 రేటింగ్ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది.
Comments
Please login to add a commentAdd a comment