Sakshi News home page

భవిష్యత్తు అంతా ఏఐ మయం.. పీఎంతో గేట్స్‌ ఆసక్తికర చర్చ

Published Fri, Mar 29 2024 10:47 AM

PM Modi And Bill Gates Interact On AI Climate Change Women Empowerment - Sakshi

జీ20 నిర్వహణతో ప్రపంచ గుర్తింపు 

అందరికీ అందుబాటులో టెక్నాలజీ

నమో దీదీతో మహిళాసాధికారత

వాతావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామన్న మోదీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారత..వంటి క్లిష్టమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతలో మార్పులు, సుస్థిరత, సామాజిక సాధికారత వంటి అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా ఏఐ ఆవిష్కరణలో దేశం అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు.

కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో ఘణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరువురు మాట్లాడుకున్నారు. ఇండియాఏఐ మిషన్‌ను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌ను కేటాయించడంపట్ల మోదీ దూరదృష్టిని గేట్స్‌ ప్రశంసించారు. ఈ మిషన్‌లో భాగంగా కొత్త ఆవిష్కరణలతోపాటు, సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పీఎం మోదీ చెప్పారు. 

డ్రోన్ పైలటింగ్ నైపుణ్యాలతో మహిళలను సన్నద్ధం చేయడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు,  గ్రామీణాభివృద్ధిని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అందులో భాగంగానే ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అందులో వినియోగిస్తున్న ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. 2021లో జరిగిన కాప్‌26 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించిన ‘పంచామృతం’ ప్రతిజ్ఞకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. వాతావరణ పరిరక్షణకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రతీకగా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన జాకెట్‌ను మోదీ ధరించినట్లు చెప్పారు.

చర్చలోని ముఖ్యాంశాలు.. 

జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు విస్తృతమైన చర్చలు చేశామని, అందులోని లక్ష్యాలను చేరే దిశగా చాలా మార్పలు తీసుకురాబోతున్నట్లు మోదీ చెప్పారు. ప్రపంచ ప్రతిష్టాత్మక జీ20 సమావేశాన్ని భారతదేశం నిర్వహించడం అద్భుతంగా ఉందని గేట్స్‌ చెప్పారు. డిజిటల్ ఆవిష్కరణలతో ఇక్కడి అభివృద్ధిని ఇతర దేశాలకు చేరవేయడంలో కృషిచేస్తామని గేట్స్‌ అన్నారు. 

2023 జీ20 సమ్మిట్ సమయంలో ఏఐ ఎలా ఉపయోగపడిందో చర్చించారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో ఏఐ సాయంతో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఎలా అనువదించబడిందో మోదీ గుర్తు చేసుకున్నారు. నమో యాప్‌లో ఏఐని ఉపయోగిస్తున్నట్లు పీఎం గేట్స్‌తో చెప్పారు. చారిత్రాత్మకంగా మొదటి, రెండో పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్‌ వలసరాజ్యంగా ఉందని పీఎం అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా డిజిటలీకరణ ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పారు. అందులో ప్రపంచంలోనే భారత్‌ ప్రధానపాత్ర పోషిస్తోందన్నారు.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమ్మను ‘ఆయ్’ అంటారు. బిడ్డ పుట్టగానే శిశువు ముందుగా నేర్చుకునే పదం 'ఆయ్' అని మోదీ అన్నారు. ఆయ్‌ అనే పదానికి AIకు దగ్గరిపోలిక ఉందని, భవిష్యత్తులో ఆయ్‌తోపాటు ఏఐ చాలాముఖ్యమని మోదీ సరదాగా చెప్పుకొచ్చారు. 

దేశంలో 2 లక్షల ఆరోగ్య మందిర్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు పీఎం చెప్పారు. వాటిని ఆధునిక సాంకేతికత సహాయంతో స్థానికంగా ఉన్న ఉత్తమ ఆసుపత్రులతో అనుసంధానించాలని గేట్స్‌ను మోదీ కోరారు. నమో డ్రోన్ దీదీ పథకం గురించి మాట్లాడారు. ప్రపంచంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండాలని కోరుకున్నట్లు పీఎం చెప్పారు. అందులో భాగంగానే భారత్‌లో చదువురాని మహిళలకు సైతం సాంకేతికతను పరిచయం చేశామన్నారు. చాలా మంది మహిళలకు సైకిల్‌ తొక్కడం తెలియదన్నారు. కానీ వారు పైలట్లుగా మారి డ్రోన్‌లను నడుపుతున్నారని వివరించారు.

Advertisement

What’s your opinion

Advertisement