సడన్‌ బ్రేక్‌... జీవితాలనే మార్చేసింది | two died in car accident at Kovvur | Sakshi
Sakshi News home page

సడన్‌ బ్రేక్‌... జీవితాలనే మార్చేసింది

Published Mon, Apr 29 2024 8:57 AM | Last Updated on Mon, Apr 29 2024 12:10 PM

two died in car accident at Kovvur

కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్‌గా బ్రేక్‌ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్‌ వ్యాన్‌ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్‌ హైవేపై ఫ్‌లైఓవర్‌ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్‌ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్‌ (32) సభలకు సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.

వినోద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్‌ సిస్టం అమర్చిన వినోద్‌ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్‌ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్‌ బాక్స్‌లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్‌ వ్యాన్‌లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్‌లైఓవర్‌ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్‌ లోడుతో వెళుతున్న లారీ సడన్‌ బ్రేక్‌ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్‌లోకి వెళ్లింది.

అప్పటికే వెనుక ఉన్న ఐషస్‌ వ్యాన్‌ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్‌ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్‌కు ఇంకా వివాహం కాలేదు.  

అదే కారణం.. 
ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్‌గా బ్రేక్‌ వేయడం, ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్‌లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్‌ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్‌ స్తంభించింది. కొవ్వూరు రూరల్‌ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement