సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు.. | Sakshi
Sakshi News home page

సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..

Published Mon, Apr 29 2024 7:52 AM

YSRCP Meeting In Visakhapatnam

ఎంవీపీ కాలనీ: ‘మీ సమస్య ఏదైనా.. ఏ అవసరమొచ్చినా బొత్స సత్తిబాబు మీ వెంట ఉన్నాడు. అన్నదమ్ముడిగా మీ మధ్య పెరిగాను.. మీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో ఈ స్థాయికి చేరాను.. ఆ ఆదరణ ఎల్లప్పుడూ నాకు, మా పార్టీకి కావాలి’అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వాసుల ఎదుట తన ఆకాంక్షను వెల్లడించారు. విశాఖ నగరంలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల ఆత్మీయ సమావేశం లాసన్స్‌ బే కాలనీలోని వైఎస్సార్‌సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో జరిగింది.

మంత్రితో పాటు బొత్స ఝాన్సీ పాల్గొని ఉత్తరాంధ్ర వాసులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాల్లో సేవలు అందించానన్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర ప్రజానీకం తనకు, తన కుటుంబానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తరువాత కూడా తమ నుంచి మునుపటి భరోసాను పొందవచ్చునన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఉత్తరాంధ్ర ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేసి అఖండ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీ ఉండాలన్నదే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని మంత్రి బొత్స పేర్కొన్నారు.

ఇందుకు అనుగుణంగానే అవినీతికి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లుగా సుపరిపాలన అందించడంతో పాటు పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్‌ పాలన సాగించారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీఎం జగన్‌ వంటి నాయకుడు దేశ రాజకీయ చరిత్రలో లేరన్నారు. మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు నమ్మకం, భరోసా, ధైర్యం అందించారన్నారు. ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ఎలాంటి బూటకపు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చిడమే సీఎం జగన్‌ అజెండా అన్నారు. లక్ష కోట్లతో విజన్‌ విశాఖ పేరిట నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ఉత్తరాంధ్ర వాసులు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement