![Ysrcp Mlc Varudu Kalyani Fires On Janasena Kiran Rayal](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Varudu-Kalyani-1.jpg.webp?itok=q09NHToT)
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళల వేదన అరణ్య రోదనగా మారిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న దారుణాలే దీనికి నిదర్శనం అని మండిపడ్డారు. హోంమంత్రి సొంత జిల్లా విశాఖలోనే ఇప్పటి వరకు 20 మందిపై అత్యాచారాలు జరిగాయంటే రాష్ట్రంలో మహిళా భద్రతకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతుందని అన్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆమెకు చీమకుట్టినట్టయినా లేదు. మహిళలకు అన్యాయం చేస్తే తాటతీస్తా, తొక్కి పెట్టి నార తీస్తానన్న కూటమి నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ఆడబిడ్డకు అన్యాయం చేస్తే వారికి అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పిన చంద్రబాబు మహిళల భద్రత గురించి ఈ 9 నెలల్లో ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు.
ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ విఫలమైందనే విషయం సాక్షాత్తు సీఎం పోలీస్ వ్యవస్థపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. 20 శాఖల మీద సీఎం చంద్రబాబు నిర్వహించిన సర్వేలో పోలీస్ శాఖ 18వ స్థానానికి పడిపోయిందంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంటుందా? దీన్ని బట్టి శాంతి భద్రతల విభాగాన్ని చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరూ విఫలమైనట్టే. పోలీస్ వ్యవస్థను శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి వాడుకోవడం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొంది.
తిరుపతిలో జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వేధింపులకు లక్ష్మి అనే మహిళ బలైంది. తనను మోసగించడంతో పాటు కోటిన్నర నగదు, 25 తులాల బంగారం తీసుకుని ఇవ్వకుండా వేధించాడని గోడును వెళ్లబోసుకున్నా కూటమి నాయకులు ఆమెకు న్యాయం చేయలేదు. ఆమె ధైర్యం చేసి కేసు పెట్టినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, విచారణ లేదు. పైగా ఆమెపైనే కేసులు పెట్టి జైలు పాలుజేశారు. ఎక్కడైనా బాధితులు కేసులు పెడితే నిందితుల మీద చర్యలు తీసుకుంటారు.
కానీ ఏపీలో మాత్రం పూర్తి విరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన నడుస్తోంది. బాధితులపైన నిందితులే కేసులు పెట్టి వేధిస్తున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను వేధిస్తే.. ఇక్కడ న్యాయం జరగదని భావించి కర్నాటకలో కేసు నమోదు చేసింది. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులకు ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రొఫెసర్‌ను దారుణంగా దూషించారు. ఈ వరుస ఘటనల్లో నో పోలీస్...నో కేస్... ఏ ఒక్కరికీ శిక్షపడకుండా బాధితులనే వేధించడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి, హోంమంత్రి అనితకి రాష్ట్రంలో మహిళలంటే ఇంత చులకనభావనా అని వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment