రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా? | Delhi Police Questions Bihar Teen In Actress Rashmika Mandanna DeepFake Video Case, Details Inside - Sakshi
Sakshi News home page

రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?

Published Wed, Nov 15 2023 1:15 PM

Actress Rashmika Mandanna DeepFake Video Case Delhi cops questions bihar teen - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా డీప్‌ ఫేక్‌ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా  ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు.  

నిందిత యువకుడి సోషల్‌ మీడియా ఖాతానుండే అప్‌లోడ్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు  కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్‌స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు యువకుడు  చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని  సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు.  (వర్క్‌ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?)

మొబైల్‌ ఫోన్‌తో సహా బిహార్‌కు చెందిన యువకుడిని  ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు.  అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్‌ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్‌ ఢమాల్‌)

కాగా నటి రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో ఆన్‌లైన్‌లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్‌బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్‌ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని  కఠినంగా అమలు చేయాలని గుర్తు  చేసింది.  (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!)

Advertisement
Advertisement