ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం 18 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 2) ప్రకటించారు. ఇదే జట్టు నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేస్తామని పాక్ సెలెక్టర్లు తెలిపారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 (మే 22) అనంతరం వరల్డ్‌కప్ జట్టు ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
జట్ల ప్రకటనకు మే 24 డెడ్‌లైన్ కావడంతో ఆలోపే తమ వరల్డ్‌కప్ జట్టును వెల్లడిస్తామని పీసీబీ ప్రతినిధులు తెలిపారు. పాక్ ఐర్లాండ్ పర్యటన ఈనెల 10న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. మే 10, 12, 14 తేదీల్లో డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
అనంతరం పాక్ ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. మే 22, 25, 28, 30 తేదీల్లో నాలుగు టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన అనంతరం పాక్ ఇక్కడి నుంచే నేరుగా టీ20 ప్రపంచకప్ వేదికకు బయల్దేరుతుంది.
టీ20 వరల్డ్‌కప్ యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1న ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీలో పాక్ ప్రయాణం జూన్ 6న మొదలవుతుంది. ఆ రోజున జరిగే తమ తొలి మ్యాచ్‌లో పాక్ ఆతిథ్య యూఎస్‌ఏతో తలపడనుంది.
డల్లాస్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్‌లో పాక్.. భారత్, యూఎస్‌ఏ, ఐర్లాండ్, కెనడా జట్లతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.
పాక్ జట్టు విషయానికొస్తే.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ నాయకత్వం వహించనున్నాడు. పేసర్ హసన్ అలీ చాలాకాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు.
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అఘా సల్మాన్ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కొద్దిరోజుల కిందట స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న హరీస్ రౌఫ్, ఆజమ్ ఖాన్ తిరిగి జట్టులోకి చేరారు. మణికట్టు స్పిన్నర్ ఉసామా మీర్, పేసర్ జమాన్ ఖాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment