ఢిల్లీ: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్త వివరణ ఇచ్చారు.
‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడానికి నాకు సంబంధం లేదు. ఐఎన్‌సి తెలంగాణ ట్విటర్ ఖాతాకి నేను ఓనర్ కాదు. ఆ ఖాతాను నేను నిర్వహించడం లేదు. నేను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను (సీఎంఓ తెలంగాణా, నా వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నాను’’ అని న్యాయవాది సౌమ్య గుప్త ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్‌రెడ్డి సమాధానం పంపారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్త అందజేసినట్లు తెలిపారు.
మరోవైపు.. ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ సీజ్ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన గీతకి ఢిల్లీ పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.
తెలంగాణలో ఇటీవల ఓ సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే కల్పిస్తామని చెప్పారు. అమిత్ షా మాటలను కొంతమంది వక్రీకరించారు. రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది.
మరోవైపు.. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఓ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరోపించారు. అమిత్ షా వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసు కేసు నమోదు చేసుకోని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరికి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment