గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తున్న ఢిల్లీ పోలీస్‌లు
అమిత్ షా ఫేక్ వీడియో దేశమంతా వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ సీరియస్
టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌కు 91/160 సీఆర్‌పీసీ కింద నోటీసులు
మరో నలుగురు టీపీసీసీ సోషల్ మీడియా బాధ్యులకూ..
గాందీభవన్‌కు వచ్చి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
రేపు (మే 1న) ఢిల్లీలోని స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని సూచన.. కేసు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి
ఎఫ్‌ఐఆర్ కాపీ అందిన పదిహేను రోజుల్లోగా వివరణ ఇస్తామని వెల్లడి
ఫేస్‌బుక్, ‘ఎక్స్’లకూ స్పెషల్ సెల్ నోటీసులు..
ఈ వీడియోను పోస్ట్ చేసిన, షేర్ చేసిన వారి వివరాలివ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నట్టుగా వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ.. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన, షేర్ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డికి, పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వీడియోను షేర్ చేసిన ఎలక్ట్రానిక్ డివైస్ (మొబైల్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్)తో సహా మే 1వ తేదీన స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్నవారిలో టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీం ఉన్నారు. వీరికి సంబంధించిన నోటీసులను గాందీభవన్‌లో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌చార్జి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. రేవంత్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడి పేరిట 91/160 సీఆర్‌పీసీ కింద నోటీసులను ఆయన నివాసంలో ఇచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్.. తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని వెల్లడించారు కూడా.
సిద్దిపేటలో మాట్లాడిన వీడియో డీప్ ఫేక్‌తో..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ వీడియోను డీప్‌ఫేక్‌తో మార్ఫింగ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా అన్నట్టుగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ, రేవంత్ పేరిట ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియో షేర్ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడి పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుండటం.. ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృత ప్రచారంలోకి రావడంతో కేంద్రం హోం శాఖ అలర్ట్ అయింది.
ఉదయమే గాంధీభవన్‌కు సమాచారం
అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారని సోమవారం ఉదయమే గాం«దీభవన్‌కు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఎఫ్‌ఎస్‌ఓ స్పెషల్ సెల్ ఇన్‌స్పెక్టర్ నీరజ్ చౌదరి నేతృత్వంలోని బృందం గాం«దీభవన్‌కు చేరుకుంది. టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది.
వారి తరఫున కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌చార్జి, అడ్వొకేట్ రామచంద్రారెడ్డి ఆ నోటీసులను తీసుకున్నారు. ఎవరి ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చారని రామచంద్రారెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు అని ఇన్‌స్పెక్టర్ వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని తమకు పంపాలని.. పూర్వాపరాలు పరిశీలించి ముందుకు వెళ్తామని, ఇందుకోసం 15 రోజుల గడువు కావాలని ఇన్‌స్పెక్టర్‌ను రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు రాతపూర్వకంగా విజ్ఞప్తిని అందజేశారు. దీనితో ఢిల్లీ పోలీసులు వెళ్లిపోయారు.
కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ఢిల్లీ పోలీసులు గాం«దీభవన్‌కు వచ్చిన విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ నాయకురాలు శోభారాణి తదితరులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పట్టారు. ఏ వీడియోను ఎవరు, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారో తెలియకుండా, ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా లేకుండా గాం«దీభవన్‌కు వచ్చి నోటీసులు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు.
ఐటీ చట్టం, సీఆర్‌పీసీల కింద కేసు నమోదు చేసి..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ‘ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)’ని ఆదేశించింది. ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ ఆదివారమే ఢిల్లీ ‘ఇంటెలిజెన్స్ ఫ్యూజియన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఓ)’ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం సెక్షన్ 66సీ, ఐపీసీలోని 153/153ఏ/465/469/171జీ సెక్షన్ల కింద కేసు (ఎఫ్‌ఐఆర్ నంబర్ 177/24) నమోదు చేసింది. అమిత్ షా వీడియోను డీప్‌ఫేక్ మార్ఫింగ్ చేసిందెవరు? ‘ఎక్స్’, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేసిందెవరనే దానిపై దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా 91/160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.
మరోవైపు ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చర్యలు చేపట్టారు.
ఫేస్‌బుక్, ‘ఎక్స్’లకూ నోటీసులు
ఈ వీడియో వ్యవహారానికి సంబంధించి ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు కూడా స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరు ఆ వీడియోను మొదట పోస్ట్ చేశారు? ఇప్పటివరకు ఎందరు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారనే వివరాలను వెబ్ లింకులతో సహా ఇవ్వాలని ఆదేశించారు.
స్పెషల్ సెల్‌కు చేసిన ఫిర్యాదులో ఏముంది?
‘‘ఒక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన వీడియోను మార్చేసి (డీప్‌ఫేక్, ఎడిట్, బోగస్ చేసి) కొందరు వ్యక్తులు ఎక్స్, ఫేస్‌బుక్ పేజీల్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి అమిత్ షా మాట్లాడినది వేరు, వాళ్లు పోస్ట్ చేసిన ప్రసంగం వేరు. ఏయే పేజీల్లో (ఎక్స్, ఫేస్‌బుక్) ఆ వీడియోను పోస్ట్ చేశారనేది లింకులతో సహా ఇస్తున్నాం. సమాజాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు.
అందుకే వాళ్లు అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ అసత్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఎక్స్, ఫేస్‌బుక్ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని, వాటికి సంబంధించిన ఇన్‌చార్జులు, నకిలీ వీడియోతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని స్పెషల్ సెల్‌కు చేసిన ఫిర్యాదులో ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ పేర్కొన్నారు.
మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment