ఏఐసీసీ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డిని సూత్రధారిగా తేల్చిన ఢిల్లీ పోలీసులు
దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.
సృష్టించి.. సర్క్యులేట్ చేసి..
మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..
షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నేడు మరో అరెస్టుకు అవకాశం..
వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్‌బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment