
సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.
కాగా, ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ.. కోర్టుకు వెల్లడించింది.
ఇదే సమయంలో జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ తెలిపింది.