ఫేక్‌ వీడియోలపై విచారణ | Investigation on fake videos | Sakshi
Sakshi News home page

ఫేక్‌ వీడియోలపై విచారణ

Published Thu, May 2 2024 4:46 AM | Last Updated on Thu, May 2 2024 4:46 AM

Investigation on fake videos

క్షేత్రస్థాయి నుంచి నివేదిక రాగానే చర్యలు

రెండు రోజుల్లో ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి

5, 6 తేదీల్లో ఇంటి వద్దే పోలింగ్‌ సదుపాయం

పట్టణాల్లో పోలింగ్‌ శాతం పెంపునకు చర్యలు

మీడియా సమావేశంలో సీఈఓ వికాస్‌రాజ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫేక్‌ వీడియోల సర్క్యులేషన్‌పై వచ్చిన ఫిర్యాదులను  పరిశీలిస్తున్నామని, విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు వచ్చిన ఫేక్‌ వీడియోల ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. 

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే 47 శాతం పూర్తయిందని, మరో రెండు, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. బూత్‌ స్థాయిలో పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. తద్వారా పోలింగ్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానా లకు తావు ఉండదన్నారు.

ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబరు 1950
లోక్‌సభ ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పాల్గొననున్నారని వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. ఏడు లోక్‌సభస్థానాల్లో 3 బ్యాలెట్‌ యూనిట్లు, 9 స్థానాల్లో 2 బ్యాలెట్‌ యూని ట్లు వాడాల్సి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనపు బ్యాలెట్‌ యూనిట్లు రప్పిస్తున్నామని వెల్లడించారు. 

పోలింగ్‌కేంద్రాల వద్ద ఎండ తగలకుండా టెంట్లు..షెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్‌లైన్‌లో వివిధ రకాలుగా 18 వేల ఫిర్యాదులు వచ్చాయని.. అందులో 16 వేలు పరిష్కరించామన్నారు. 

రాష్ట్రంలో  3,32,32,318 మంది ఓటర్లు
రాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్‌ తెలిపారు.  మొత్తం 35,809 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 9,900 ఉన్నట్లు చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయన్నారు.

పోలింగ్‌శాతం పెంచాలని..
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 5 వేల పోలింగ్‌ కేంద్రాల్లో తక్కువ పోలింగ్‌ శాతం రికార్డు అవుతున్నట్టు గుర్తించామన్నారు. పోలింగ్‌ సమయంలో సెక్టార్‌ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా పోలింగ్‌ ప్రక్రియ నిదానంగా జరిగినా, తక్కువ పోలింగ్‌ నమోదవుతున్నా వెంటనే అలర్ట్‌ అయి పరిస్థితిని చక్కదిద్దు్దతారన్నారు. 

5, 6 తేదీల్లో హోం ఓటింగ్‌
ఇంటి వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసేందుకు 23,248 మంది దరఖాస్తులను ఆమోదించినట్టు వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఇందులో వయోవృద్ధులు 10,362 మంది, దివ్యాంగులు 11,032 మంది, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఓటర్లు 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5, 6న వీరికి వారి ఇంటి దగ్గరే ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. 

ఇప్పటికి 7,185 కేసులు
7185 కేసులు నమోదు చేసినట్టు వికాస్‌రాజ్‌ తెలిపారు. ఆబ్కారీ శాఖ 6560 కేసులు, డ్రగ్స్‌ అండ్‌ నార్కోటిక్స్‌ కింద 287 కేసులు, ఐపీసీ కేసులు 309, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 21 కేసులు నమోదైనట్లు వివరించారు. రూ. 81 కోట్లు నగదు,  రూ.46 కోట్లు విలువైన లిక్కర్, రూ. 26 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.27 కోట్లు విలువ చేస్తే ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.212 కోట్ల విలువైన నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement