Five Of Doctor's Family Found Dead Under Suspicious Circumstances In Vijayawada, Details Inside | Sakshi
Sakshi News home page

Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!

Published Wed, May 1 2024 7:45 AM | Last Updated on Wed, May 1 2024 2:05 PM

Five Of Family Found Dead In Vijayawada

స్నేహితుల మోసం, ఆర్థిక ఇబ్బందులతో వైద్యుడి ఆత్మహత్య

అనాథలవుతారన్న భయంతో తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చిన వైనం  

విజయవాడ గురునానక్‌ నగర్‌లో అలముకున్న విషాదఛాయలు

పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ధారావత్‌ శ్రీనివాస్‌(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్‌ నగర్‌లో జరిగింది. శ్రీనివాస్‌ అన్న దుర్గాప్రసాద్‌ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్‌ కమిషనర్‌ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్‌సింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం మేరకు.. 
విజయవాడ గురునానక్‌ నగర్‌లోని మారుతీ కో– ఆపరేటివ్‌ కాలనీలో ప్లాట్‌ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్‌ శ్రీనివాస్‌ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్‌ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్‌తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్‌ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్‌ క్లినిక్‌ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్‌ ధారవత్‌ శ్రీనివాస్‌ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.

వారం క్రితమే దారుణానికి వ్యూహం 
తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్‌ శ్రీనివాస్‌ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్‌ 25వ తేదీన గురునానక్‌ నగర్‌లోని సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్‌ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్‌కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.

తన వాట్సాప్‌కు వాయిస్‌ మెసేజ్‌ 
ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్‌ శ్రీనివాస్‌ తన వాట్సాప్‌ నంబరుకు వాయిస్‌ మెసేజ్‌ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్‌లో వివరించారు.    

క్లూస్‌ టీంతో ఆధారాల సేకరణ 
డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ డాగ్‌స్కా్వడ్, క్లూస్‌ టీంను రప్పించారు. శ్రీనివాస్‌ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్‌ మార్కెట్‌ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు డాక్టర్‌ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

మోసాన్ని జీరి్ణంచుకోలేక..! 
ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్‌కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్‌ క్లినిక్‌ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్‌ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్‌ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్‌ తండ్రి జమలయ్య నాయక్‌ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్‌ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement