వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీపై హత్యాయత్నం

Published Mon, Jun 19 2023 3:56 AM

Assassination attempt on YSRCP MPTC - Sakshi

తిరుపతి రూరల్‌: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు బోస్‌చంద్రారెడ్డిపై శనివారం రాత్రి కొందరు దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఎంపీటీసీ సభ్యుడిని కత్తితో పొడిచేందుకు యత్నించడంతోపాటు అతని కారును కాల్చివేసేందుకు వేసిన పథకం విఫలమైంది. ఈ ఘటనలో కత్తితో సహా ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాజీ పీఆర్వో సతీష్, ఓ సినీ హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి సూచనల మేరకే ఈ ఘటనకు పాల్పడినట్లు పట్టుబడిన వ్యక్తి మీడియాతో చెప్పడం విశేషం.

బాధితుడు బోస్‌చంద్రా­రెడ్డి తెలిపిన వివరాలు.. సతీష్, సునీల్‌చక్రవర్తి గతంలో బోస్‌చంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్‌ మౌనిష్రెడ్డితో గొడవపడ్డారు. ఓ భూమి, షాపు విషయంలోనూ ఎంపీటీసీ, ఉప సర్పంచ్‌తో సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో బోస్‌చంద్రారెడ్డిపై కక్ష పెంచుకున్న సతీష్, సునీల్‌చక్రవర్తిలు ఓ సినీహీరో వద్ద బౌన్సర్‌గా పనిచేసిన హేమంత్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో శనివారం రాత్రి హేమంత్‌ మరో ఐదుగురు కలిసి రాడ్‌లు, కత్తులు, పెట్రోల్‌ బాటిల్స్‌తో మారుతీనగర్‌లోని బోస్‌చంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు.

కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించి.. జన సంచారం ఉండటంతో ఆఖరి నిమిషంలో పరారయ్యారు. అనంతరం మళ్లీ రాత్రి 11 గంటలకు ఇలానే దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు మళ్లీ కత్తులు, రాడ్‌లు, పెట్రోల్‌తో దాడికి రావడంతో వారిపై బోస్‌చంద్రారెడ్డి అనుచరులు తిరగబడ్డారు. హేమంత్‌ కత్తితో సహా పట్టుబడగా.. మిగిలినవారు పారిపోయారు. అతన్ని పట్టుకుని విచారించిన బోస్‌చంద్రారెడ్డి వర్గీయులు, రంగంపేట­లోనూ మరో బ్యాచ్‌ ఉన్నారని చెప్పడంతో కారులో అతన్ని ఎక్కించు­కుని రంగంపేటకు వచ్చారు. అప్పటికే వారు కూడా పారిపోయారు.

ఈ హత్యాయత్నానికి సతీష్‌ కీలకసూత్రధారి అని, అతనే బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్‌­రెడ్డిలపై దాడి చేయమన్నారని, దీనిలో సునీల్‌చక్రవర్తి పాత్ర కూడా ఉందని హేమంత్‌ మీడియాకు తెలిపాడు. హత్యచేయడం లక్ష్యం కాదని, కారును కాలి్చవేసి భయపెట్టాలని యత్నించినట్టు చెప్పాడు. నిందితులకు సతీష్‌ ఫోన్‌పే ద్వారా నగదు పంపించడం, అర్ధరాత్రిళ్లు కూడా సునీల్‌చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతుండటంతో బాధితులు నిజనిర్ధారణకు వచ్చారు.

హేమ­ంత్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగిన ప్రదేశం తిరుపతి యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండటంతో బోస్‌చంద్రారెడ్డి అక్కడే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, కొన్ని మీడియాల్లో సినీనటులు మోహన్‌బాబు, విష్ణువర్ధన్‌బాబుపై అసత్య ప్రచా­రం చేయడాన్ని బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్రెడ్డిలు ఖండించారు. చంద్రగిరిలో విలేకరుల సమావేశం పెట్టి జరిగిన ఘటనలతో వారికి ఎలాంటి సంబంధం లేదని, అసత్యప్రచారాలు మాను­కోవాలని స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బోస్‌చంద్రారెడ్డి, మౌనిష్‌రెడ్డితోపాటు గ్రామస్తులు ధర్నా చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement