టీ20 వరల్డ్‌కప్ 2024లో పటిష్టమైన పాకిస్తాన్‌పై పసికూన యూఎస్‌ఏ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ పాక్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించి చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్ల నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్‌లో యూఎస్‌ఏ మరింత అద్భుతంగా ఆడి పాక్‌ను మట్టికరిపించింది.
యూఎస్‌ఏ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాధిస్తుండగానే ఆ దేశానికే చెందిన బౌలర్ (ప్రపంచకప్ జట్టులో సభ్యుడు కాడు) రస్టీ థెరాన్ పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని థెరాన్ ఆరోపించాడు. కేవలం రెండు ఓవర్లు వాడిన బంతిని రౌఫ్ వేళ్లతో రద్దుతూ (బంతిని పాతగా చేసే ఉద్దేశంతో) కనిపించాడని అన్నాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నందుకు రౌఫ్ ఈ పనికి చేశాడని కామెంట్ చేశాడు.
ఈ విషయాన్ని ఐసీసీ చూసీ చూడనట్లు వదిలేసిందని మండిపడ్డాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు టీవీల్లో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు థెరాన్ ట్వీట్ చేశాడు.
38 ఏళ్ల థెరాన్ 2010 నుంచి 2019 వరకు సౌతాఫ్రికాకు ఆడాడు. ఆ తర్వాత ఆ దేశం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వలస వచ్చాడు. 2019 సెప్టెంబర్ నుంచి థెరాన్ యూఎస్‌ఏ జట్టుకు ఆడుతున్నాడు.
యూఎస్‌ఏ టీ20 వరల్డ్‌కప్ జట్టులో థెరాన్‌కు చోటు దక్కలేదు. థెరాన్ 2010-15 మధ్యలో వివిధ ప్రాంచైజీల తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన థెరాన్ 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment