టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8కు చేరాలన్న పాకిస్తాన్ ఆశలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జూన్ 14) యూఎస్‌ఏ, ఐర్లాండ్ జట్లు పోటీపడాల్సి ఉండగా.. మ్యాచ్ ప్రారంభానికి వరుణుడు అడ్డు తగులుతున్నాడు. భారతకాలమానం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అర్ద గంట గడిచినా టాస్ కూడా పడలేదు.
వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ కూడా వేయలేదు. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు అంపైర్లు మరో మారు మైదానాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఒకవేళ అప్పటికీ మైదానం తడిగా ఉంటే మ్యాచ్ మరో గంట ఆలస్యం కావచ్చు. ఇదే జరిగే ఓవర్లు కుదించి మ్యాచ్ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ మరోసారి వరుణుడు ఆటంకం కలిగిస్తే మ్యాచ్ పూర్తిగా రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇలా జరిగితే యూఎస్‌ఏ, ఐర్లాండ్‌కు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న యూఎస్‌ఏ.. మరో పాయింట్ ఖాతాలో పడితే ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాక్ తదుపరి ఆడాల్సిన మ్యాచ్‌లో గెలిచినా నాలుగు పాయింట్లు మాత్రమే వారి ఖాతాలో ఉంటాయి. ఈ లెక్కన పాక్ ఇంటికి.. యూఎస్‌ఏ సూపర్-8కి చేరుకుంటాయి.
ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ నుంచి భారత్ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం యూఎస్‌ఏ, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్‌లో ఉన్న మరో రెండు జట్లు (కెనడా, ఐర్లాండ్) టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించలేదు.
గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్-8కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి నమీబియా, ఒమన్.. గ్రూప్-సి నుంచి ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్.. గ్రూప్-డి నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment