వృద్ధులకు ఆరోగ్య ధీమా! | Sakshi
Sakshi News home page

వృద్ధులకు ఆరోగ్య ధీమా!

Published Fri, Apr 26 2024 5:52 AM

Sakshi Editorial On Health Insurance For Senior Citizens

అరవై అయిదేళ్ళు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఇది అక్షరాలా ఆనందం కలిగించే వార్త. పిల్లలు, విద్యార్థులు, గర్భిణులు, సీనియర్‌ సిటిజన్లతో సహా అన్ని వర్గాలకూ ఆరోగ్య బీమా పాలసీలు అందివ్వాలనే కొత్త నిర్ణయం వచ్చింది. దేశంలోని బీమా పాలసీలకు సంబంధించి అత్యున్నత నియంత్రణ సంస్థ అయిన ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ’ (ఐఆర్‌డీఏఐ) ఆ మేరకు బీమా సంస్థలన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. 

ఇకపై క్యాన్సర్, హృద్రోగం, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్‌ లాంటి వ్యాధులున్నాయని ఆరోగ్య బీమా పాలసీలు నిరాకరించడానికి వీల్లేదని తేల్చింది. అదే సమయంలో, నియమ నిబంధనలు పాటిస్తూ ఆ యా వయసుల వారికి తగ్గట్టుగా ప్రత్యేకమైన బీమా పాలసీలు రూపొందించుకొనే స్వేచ్ఛ సంస్థలకు ఇచ్చింది. దీంతో, ఇప్పుడిక 65 ఏళ్ళు, ఆపై బడిన తర్వాత కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకొనే వీలు చిక్కింది. 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకం కిందకు తెస్తామని అధికార పక్షం పేర్కొన్న కొద్ది రోజులకే ఈ నిర్ణయం రావడం గమనార్హం. 

అలాగే, సీనియర్‌ సిటిజన్ల సమస్యలు, ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు ప్రాధికార సంస్థ సూచించింది. పాలసీ కొనడానికి ముందే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ వారికి తగిన ఆరోగ్య బీమా పాలసీలు తప్పక ఇవ్వాలని పేర్కొంది. ముందుగానే ఉన్న వ్యాధుల (పీఈడీ) విషయంలో బీమా రక్షణకు నిరీక్షించే కాలాన్ని మునుపటి 48 నెలల నుంచి 36 నెలలకే తగ్గించింది. 

బీమా అంశంలో ఈ సరికొత్త సంస్కరణలు అటు ఊహించని ఆరోగ్య ఖర్చులు ఎదురైన వృద్ధులకే కాక, వయసు మీద పడ్డ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న ఉద్యోగులకూ పెద్ద ఊరట. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారి నుంచి తమకు ప్రేమాస్పదులైన వ్యక్తులకు రక్షణనిచ్చేందుకు కొండంత అండ. వయోవృద్ధులకు పరిమిత ప్రయోజనాలే అందిస్తున్న ప్రస్తుత ధోరణి నుంచి బీమా సంస్థలు బయటకొచ్చి, తల్లితండ్రులతో సహా పాలసీదారు కుటుంబం మొత్తానికీ సమగ్ర బీమా వసతి కల్పించేలా కొత్త పాలసీలు తేగలుగుతాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను సైతం మార్చగలుగుతాయి.

నిజానికి, వయసు మీద పడ్డాకనే ఎవరికైనా ఆరోగ్య బీమా మరింత అవసరం, ఉపయోగం. ఇప్పటి దాకా నిర్ణీత వయసు దాటాక వ్యక్తిగత ఆరోగ్య బీమాకు వీలుండేది కాదు. కానీ, కొత్త సంస్క రణలతో ఆ అడ్డంకి తొలగింది. ప్రత్యేకించి రానున్న రోజుల్లో మన దేశ జనాభాకు ఇది కీలకం. 2011 తర్వాత దేశంలో జనగణన జరగలేదన్న మాటే కానీ, ఐరాస జనాభా నిధి, ఇతర నిపుణుల లెక్క ప్రకారం భారత జనాభా చైనాకు సమానంగా ఉంది. 

2023లో ఒక దశలో మనం చైనాను దాటినట్టు కూడా అంచనా. ఈ ఐరాస అంచనాల ఆధారంగా నిరుడు ‘భారత వార్ధక్య నివేదిక – 2023’ను సిద్ధం చేశారు. దాని ప్రకారం దేశంలో 10 శాతమున్న సీనియర్‌ సిటిజన్ల జనాభా వచ్చే 2050 నాటికి ఏకంగా 30 శాతానికి పెరగనుంది. మరోమాటలో అరవై ఏళ్ళ పైబడిన వారి సంఖ్య 2022 నాటి 14.9 కోట్ల నుంచి 34.7 కోట్లకు చేరుతుంది. అది అమెరికా ప్రస్తుత జనాభా కన్నా ఎక్కువ. 

ఒక్క భారత్‌లోనే కాదు... అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో వయోవృద్ధులు దాదాపు 16 నుంచి 28 శాతం దాకా ఉన్నారు. మెరుగైన ఆరోగ్య వసతులు, పెరిగిన ఆయుఃప్రమాణం వల్ల ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సీనియర్‌ సిటిజన్ల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ నిధులతో ప్రజారోగ్య వ్యవస్థలున్నా, ఇతర దేశాల్లో మాత్రం ఖరీదైన ప్రైవేట్‌ ఆరోగ్య సంరక్షణే దిక్కు. 

అలాంటి చోట్ల ఖర్చెక్కువ, వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమాకు చెల్లించాల్సిన ప్రీమియమ్‌లూ ఎక్కువన్నది నిజమే. కానీ, 65 ఏళ్ళు దాటితే కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి వీలు కాదనే నిబంధన చాలా దేశాల్లో లేదని గమనించాలి. ఇప్పుడు మన దేశమూ ఆ మార్గంలోకి వచ్చి, గరిష్ఠ వయఃపరిమితి షరతు లేకుండా, అన్ని వయసుల వారికీ ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్న మాట. దానికి తోడు పీఈడీ నిరీక్షణ కాలాన్ని తగ్గించడం, తీవ్ర వ్యాధులున్నా సరే బీమా ఇవ్వాలనడం ప్రజానుకూల, ప్రశంసాత్మక నిర్ణయాలు. 

ప్రాధికార సంస్థ ఆ మధ్య జీవిత బీమా పథకాల సరెండర్‌ ఛార్జీల విషయంలో సంస్కరణలు తెచ్చింది. మళ్ళీ ఇప్పుడిలా వినియోగదారుల పక్షాన మరోసారి మరికొన్ని నిబంధనల్ని సవరించడం విశేషం. అయితే, అదే సమయంలో బీమా సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా చూడడం అవసరం. ప్రాధికార సంస్థ ఆదేశాల స్ఫూర్తిని విస్మరించి, అందుబాటులో లేని అతి ఖరీదైన పాలసీలను సంస్థలు తీసుకొస్తే నిష్ప్రయోజనం. 

అర్థం కాని సాంకేతిక పదజాలం, సంక్లిష్టతలతో పాలసీలు తీసుకొచ్చినా కస్టమర్లు విముఖత చూపుతారు. పాలసీలలో పారదర్శకత పాటిస్తూ, ఇబ్బంది లేకుండా సులభంగా క్లెయిమ్‌లు పరిష్కారమయ్యే మార్గాన్ని బీమా సంస్థలు అనుసరిస్తే మంచిది. అప్పుడే వినియోగదారులు ఉత్సాహంగా ముందుకు వస్తారు. తాజా బీమా సంస్కరణల తాలూకు ఫలితమూ సమాజానికి అందివస్తుంది. 

దేశంలోని సీనియర్‌ సిటి జన్లలో నూటికి 98 మందికి ఇవాళ్టికీ ఆరోగ్య బీమా లేకపోవడం సిగ్గుచేటు. అంతకంతకూ పెరుగు తున్న వైద్య, ఆరోగ్యసేవల ఖర్చు రీత్యా బీమా ఆపత్కాలంలో బలమైన భరోసా. జీవితం పొడు గునా కుటుంబానికీ, సమాజానికీ తమ వంతు సేవ చేసి, ప్రకృతి సహజపరిణామంగా వయసుపై పడ్డ ఈ పండుటాకుల గురించి పాలకులు లోతుగా ఆలోచించాలి. బీమా పాలసీలొక్కటే సరిపోవు. ఆర్థికంగానే కాక ఆరోగ్యపరంగానూ వారి బాగు కోసం ఇతర ప్రత్యామ్నాయాలనూ అన్వేషించాలి.
 

Advertisement
Advertisement