మూడు దారులు.. వేరు.. వేరే! | Sakshi
Sakshi News home page

మూడు దారులు.. వేరు.. వేరే!

Published Sat, Feb 10 2024 6:55 PM

Devulapalli Amar 'Mudu Darulu' Book Launch - Sakshi

'ముగ్గురు ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా చూడాలంటే అయితే రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి లేకపోతే పాత్రికేయుడైనా అయి ఉండాలి. దేవులపల్లి అమర్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడు కావడంతో రాజకీయాల్లో దిగ్గజాలనదగిన ముగ్గురు నాయకులను అతి సమీపంనుంచి చూసి, వారి నడతను, వ్యవహార శైలినీ, రాజకీయ పరిణతిని అంచనా వేసే అవకాశం దొరికింది.'

రాసింది ముగ్గురు నేతల గురించే అయినా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటునుంచి మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్ అవతరణ మీదుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ తెలుగునాట చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను రచయిత విపులంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచే ఈ తరానికి, ముఖ్యంగా యువతరానికి ఈ విషయాలన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. (ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కాంగ్రెస్‌లో వేళ్లూనుకుపోయిన ముఠా సంస్కృతి కారణంగా కూలిపోయిందన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఇలాంటి విస్తుగొలిపే అనేక రాజకీయ పరిణామాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది) అప్పటి పరిణామాల గురించి ఈనాటి యువతరానికి జరిగింది జరిగినట్లు చెప్పేందుకు చేసిన ఓ ప్రయత్నమే ఈ పుస్తక రచన అని రచయితే స్వయంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

వైఎస్ఆర్, చంద్రబాబుల గురించి విశ్లేషించే క్రమంలో వారిద్దరినీ రచయిత ఒక తాసులో ఉంచి తూచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా, తర్వాత రాజకీయ విరోధులుగా మారిన ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను ఇలా తూచి తీర్పు చెప్పడం తప్పేమీ కాదు. పైగా అప్పట్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు రచయిత సాక్షిగా ఉన్నందువల్ల సాధికారికంగా ఇలా బేరీజు వేసే అర్హత ఆయనకు ఉంది.

‘అధికారం కోసం పార్టీ మారి, అందలం కోసం అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయినా అదే పార్టీలో కొనసాగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు ఏ విషయంలోనూ పోలిక లేదు’ అంటారు రచయిత. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు జగన్ చేసిన ప్రయత్నాలనూ, అధిష్ఠానం తృణీకార ధోరణిని భరించలేక వేరు పార్టీ పెట్టిన వైనాన్ని కూడా పుస్తకంలో విశదంగా పొందుపరిచారు. పదహారు నెలలు జైలులో ఉండి, బయటకు వచ్చి ప్రజాభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమాన్ని ఆసక్తికరంగా రాశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు మీద రచయిత విమర్శనాస్త్రాలు  సంధించినా వాటన్నింటినీ సహేతుకంగా, సాధికారికంగా విశ్లేషించారు. ముఖ్యంగా 1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర, 1995లో చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాలను సరిపోలుస్తూ, ఈ రెండూ సంఘటనలూ ఒకే రీతిలో జరిగినా నాదెండ్ల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజల నుంచీ, ప్రజాస్వామ్య పక్షాలనుంచీ, మీడియా నుంచీ ఎన్టీఆర్‌కు లభించిన మద్దతు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే లభించలేదంటారు. వెన్నుపోటు సంఘటనను వివరించేందుకు ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అంటూ రచయిత ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించారు. తొమ్మిది రోజులపాటు రోజువారీ చోటు చేసుకున్న పరిణామాల గురించి చదువుతున్నప్పుడు రచయిత మరోసారి పాత్రికేయుడిగా పరకాయప్రవేశం చేశారనిపిస్తుంది.

అన్నీ తనవల్లనే జరిగాయని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారన్న రచయిత.. అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది తానేనని, ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందనీ, తానే ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ రెండూ అబద్ధాలేనంటూ తగిన సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలననూ సాధికారికంగా విశ్లేషించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ చిత్తశుద్ధిని, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ పాలనను వివరించడానికి రచయిత ఒక ప్రత్యేక చాప్టర్‌ను కేటాయించారు.

ఫోటోల ఎంపికలో రచయితకు ఫుల్ మార్కులు పడతాయి. ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఫోటోలు ప్రచురించడం మెచ్చుకోదగినది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వైఎస్ఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలపై, నీతిబాహ్యమైన చర్యలపై రచయితకు గల ధర్మాగ్రహం ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది.  తప్పయితే తప్పనీ, ఒప్పయితే ఒప్పనీ బల్లగుద్ది చెబుతూ సాగే రచయిత శైలి ఆకట్టుకుంటుంది. ఇప్పటి తరానికే కాదు, భావితరాలకు కూడా తెలుగు రాజకీయ పరిణామాలపై ఈ పుస్తకం ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. – బీ.ఎస్. రామకృష్ణ (బీ.ఎస్.ఆర్)

ఇవి చదవండి: భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు'

Advertisement
Advertisement