ధర్మం అంటే..? మంచిమాట | Sakshi
Sakshi News home page

ధర్మం అంటే..? మంచిమాట

Published Mon, Apr 15 2024 5:50 AM

Separation of personal dharma prevents development - Sakshi

ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు.

మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం,  త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి.

మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం.

అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది.

ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది.

కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది.
ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు.

ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది.  అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది.

స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం  అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం.

– తరిగొప్పుల వీఎల్లెన్‌ మూర్తి

Advertisement
Advertisement