Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్‌ ఆన్, ఆఫ్‌! | Sakshi
Sakshi News home page

Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్‌ ఆన్, ఆఫ్‌!

Published Tue, Feb 13 2024 8:51 AM

Turn The Motor On And Off With This Startup Company Device - Sakshi

'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్‌ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్‌తో బోర్‌ మోటర్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్‌ చేయొచ్చు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్‌ బేస్‌డ్‌ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్‌ స్టార్టర్‌ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..'

వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్‌ ఆన్, ఆఫ్‌ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే,  ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్‌ ఆన్, ఆఫ్‌ చేయించేవారు.

ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్‌ నెట్‌వర్క్‌ ఉంటే చాలు.. మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్‌ మోటర్‌ను ఆన్‌ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్‌ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్‌ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్‌ను ఆన్‌ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్‌ కంపెనీ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్‌) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్‌ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్‌లో మాదిరిగానే ఒక సిమ్‌ కార్డు ఉంటుంది.

దాని ద్వారా మెసేజ్‌ రూపంలో పొలంలో నీటి మోటర్‌కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్‌కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్‌ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్‌కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్‌ సిగ్నల్స్‌ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్‌ను ఆఫ్, ఆన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోయి.. రైతుకు మొబైల్‌లో సందేశం వస్తుంది. 

ఉపయోగాలెన్నో..
ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్‌హాక్‌ మోడ్‌) న్యాస్త మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌ చేసుకోవచ్చు, ఆఫ్‌ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్‌ నడవాలి (ఇంట్రవెల్స్‌ మోడ్‌)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్‌ను ఏ సమయానికి ఆన్‌ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్‌ చేయాలి? అని టైమ్‌ సెట్‌ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్‌ అవుతుంది, అదే ఆఫ్‌ అవుతుంది.

షెడ్యులర్‌ మోడ్‌: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్‌ అయ్యేలా షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్‌ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది.

దొంగల భయం లేదు..
వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్‌ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్‌ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్‌ బేస్‌డ్‌ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్‌ స్టార్టర్‌ పనిచేస్తుంది.

అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్‌ చేయగానే మొబైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా దాని లొకేషన్‌ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్‌ ద ఎయిర్‌ (ఒ.టి.ఎ.) సర్వర్‌ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్‌డేట్‌ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్‌ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట

ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును!
8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్‌ ఉండటంతో పైప్‌లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్‌ను బంద్‌ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్‌ ద్వారానే మోటర్‌ను ఆన్, ఆఫ్‌ చేస్తున్నా. సెల్‌ఫోన్‌తో బోర్‌ మోటర్‌ ఆఫ్, ఆన్‌ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా

ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు..
ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్‌తో ఎక్కడికైనా ఫంక్షన్‌కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్‌ను సెల్‌ఫోన్‌లో నుంచే ఆన్, ఆఫ్‌ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా

నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం

Advertisement
Advertisement