కాటేస్తున్న కాలుష్యం | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న కాలుష్యం

Published Mon, Jun 19 2023 4:15 AM

99 percent of people are breathing polluted air - Sakshi

సాక్షి, అమరావతి :  ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఒక్క ఏడాదిలో 66.67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది. అవన్నీ ఉత్తర భారత దేశ నగరాలే కావడం గమనార్హం.

గాలి కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో 2022లో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ గాలిలో కలుషిత పదార్థాలు 2.5 మైక్రో గ్రాములకు మించకూడదు. అయితే అన్ని దేశాల్లో గాలిలో కలుషిత పదార్థాల తీవ్రత నిర్దేశించిన ప్రమాణాల కంటే నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడి తీవ్రమైన రక్తపోటుతో 2019లో ఏకంగా 66.67 లక్షల మంది మరణించినట్లు వెల్లడైంది. 

పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో.. 
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు,  నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ప్రపంచంలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్‌ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని హటన్‌ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్‌ ఆళ్వార్‌ జిల్లాలోని బివాడీ కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది.  

పరిశ్రమలు, వాహనాల పొగ.. గడ్డి కాల్చివేతతో 
వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వాటి నుంచి వెలువడే పొగ... ప్రమాణాలు పాటించని పరిశ్రమలు... వ్యర్థాలను అడ్డగోలుగా కాల్చేయడం... నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ చేయడం.. పంట కోతల తర్వాత గడ్డిని పొలాల్లోనే కాల్చేయడం వల్ల ఓజోన్‌ పొరకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాౖMð్సడ్, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ లాంటి విష వాయువుల విడుదలతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Advertisement
Advertisement