రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌.. | Sakshi
Sakshi News home page

రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌..

Published Wed, Mar 20 2024 7:27 PM

PM Modi Dials Vladimir Putin Congratulates Him On His Re Election - Sakshi

న్యూఢిల్లీ:  రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై శాంతి కోసం భారత్‌ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

కాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇద్దరూ ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రాధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. రష్యన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికైనందుకు పుతిన్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. రష్యా ప్రజల శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఆకాంక్షించారు. రాబోయే కాలంలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.  

కాగా  ఇటీవల జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ ఘన విజయం సాధించారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. ఇప్పటికే 1999 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్‌.. మరో ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉండనున్నారు. దాంతో రష్యాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన జోసెఫ్‌ స్టాలిన్‌ రికార్డును అధిగమించనున్నారు.

మరో పోస్ట్‌లో.. భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై జెలెన్‌స్కీ మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు భారత్‌ నుంచి స్ధిరమైన మద్దతు లభిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే భారత్‌ నుంచి తమ ప్రజల కోసం మానవతా సహాయాన్ని అందించడం కొనసాగుతుందని పేర్కొన్నారు.

చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!

Advertisement
Advertisement