ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విస్ట్ ఇచ్చారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన.. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కాసేపటి కిందట కాంగ్రెస్ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది.
ఇక అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.
రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటే
1952లో రాయ్ బరేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఫిరోజ్ గాంధీ(రాజీవ్ గాంధీ తండ్రి) ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్ నారాయణ్ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్ నెహ్రూ, షీలా కౌల్ కాంగ్రెస్ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్ సింగ్ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదు పర్యాయాలు(2006 ఉప ఎన్నికతో సహా) సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ వచ్చారు.
ఇంకోవైపు ఈ రెండు లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ) నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్ బరేలీ ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆయన దేని నుంచి పోటీ చేస్తారు?.. అసలు ఆయన ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలకు కాంగ్రెస్ కంచుకోటలుగా పేరుండేది. అమేథీలో రాహుల్ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అదే ఎన్నికలో కేరళ వయనాడ్ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే..
క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి ఆయన దూరం జరిగారు. కేవలం వయనాడ్ నుంచి మాత్రమే ఆయన నామినేషన్ వేశారు. ఇదే అదనుగా.. పోటీ చేయడానికి రాహుల్ జంకుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. దీంతో బీజేపీ విమర్శలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. రాహుల్ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి చేరుకుంది.
మరోవైపు కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం దేశం మొత్తం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వివరించే యత్నం చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో.. అక్కడి కాంగ్రెస్ అభ్యర్థిపైనా ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నిక సహా ఐదుసార్లు ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానంలో ఆమె తనయ, ఏఐసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.
ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అన్నాచెల్లెళ్లతో వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోటీకి ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. అమేథీ నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీకి రాహుల్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ రెండు స్థానాల నామినేషన్ల దాఖలుకు ఇవాళే ఆఖరు తేదీ. దీంతో భారీ ర్యాలీగా రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఐదో ఫేజ్‌లో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment