కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్
తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనే
లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి
బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేత
తిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠా
బరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబు
ఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్
అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణ
అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహం
మార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికి
ఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుం
పంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటి
నియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్
పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే
(సాక్షి, అమరావతి) : నిన్నటికి నిన్న... ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.04 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. తరవాత ఇవి తెలుగుదేశం నాయకులు తరలిస్తున్నట్లుగా తేలింది. దానికి ఒక్కరోజు ముందు... కదిరిలో ఓ ప్రయివేటు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అది సాక్షాత్తూ అక్కడి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనం. ఆయన పేరిట రిజిస్టరయి ఉండటంతో టీడీపీకి బొంకడానికి కూడా అవకాశం లేకపోయింది.
ఇక విశాఖలో ఈ మధ్యనే మార్గదర్శి సిబ్బంది బేషరమ్‌గా తీసుకెళుతున్న రూ.కోటికి ఇప్పటికీ లెక్కలు చెప్పలేదు. రెండు రోజుల కిందట తిరుపతిలో డ్వాక్రా మహిళలకు ఎర వేయటానికి అక్కడి టీడీపీ నాయకులు ఏకంగా ప్యాకెట్లలో రూ.3వేల నగదు, చీరలు పెట్టి పంపిణీ చేస్తూ దొరికిపోయారు. అక్కడ పంచిన మొత్తమే రూ.కోటి వరకూ ఉండొచ్చని అంచనా. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యగ్నేశ నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో నగదు దొరికినా... నోవా అగ్రిటెక్ కంపెనీ ముసుగులో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నిస్సిగ్గుగా ఓట్ల కొనుగోళ్లకు తెగబడినా... ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే.
ఈ ఎన్నికల్లో గెలవకపోతే తాను, తన పార్టీ ఏవీ మిగలవన్న భయంతో చంద్రబాబు ఏకంగా డబ్బుల డ్యామ్‌కు కట్టలు తెంచేసి... ప్రవాహాన్ని వదిలిపెట్టేశాడు. ఇన్నేళ్ల అవినీతి సొమ్ములో కొంత ఖర్చు చేయక తప్పదని తాను కొంత పెడుతూ... తన వర్గీయులనందరినీ బరిలోకి దింపేశాడు. విదేశాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి బాబు వర్గానికి చెందిన వారంతా సామాజికవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తల ముసుగులో ఎక్కడికక్కడ తిష్ట వేసి డబ్బులు వెదజల్లుతున్నారు. పోలీసులు ముమ్మరంగా సోదాలు జరుపుతుండటంతో ఒకటీ అరా చోట్ల ఇలా దొరికిపోతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు... తన వర్గాన్ని, ఎన్నారై మద్దతుదారులను రంగంలోకి దించిన చంద్రబాబు వివిధ మార్గాల్లో రూ.13 వేల కోట్ల వరకూ సమీకరించి వెదజల్లుతున్నారు. పచ్చ ముఠా సభ్యులైన మార్గదర్శి చిట్‌ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ పెద్దలకు చెందిన రియల్ ఎస్టేట్, ఇతర సంస్థలు, తీరప్రాంతంలోని షిప్పింగ్ కంపెనీలను వీటి స్టోరేజీ కోసం ఉపయోగిస్తున్నట్లుగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకోవడంతోపాటు ఓట్ల కొనుగోలు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ జట్టును ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రిటైర్డ్, సస్పెన్షన్‌లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో ఆ జట్టును ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు నియోజకవర్గానికి రూ.75 కోట్లు చొప్పున మొత్తం రూ.13 వేల కోట్లకుపైగా వెదజల్లేందుకు సిద్ధపడటం చంద్రబాబు బరితెగింపు రాజకీయాలకు నిదర్శనం.
‘పచ్చ’ కామెర్లు సోకిన ఈనాడు రామోజీకి పచ్చ దందా కానరావటం లేదు. నేరుగా టీడీపీ అభ్యర్థి వాహనంలో పోలీసులు రూ.2 కోట్లు పట్టుకున్నా.. రామోజీ మాత్రం తన పత్రికలో ఒక్క అక్షరం కూడా రాయలేదంటేనే ఆయన కళ్లు ఏ స్థాయిలో కామెర్లతో మూసుకపోయాయో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇది ‘ఈనాడు’ చెబితేనే లోకానికి తెలిసే కాలం కాదు కదా!!.
‘మార్గదర్శి’ ‘నారాయణ’, ఇతర కంపెనీలదే కీలక పాత్ర
టీడీపీ అధికారంలో ఉండగా యథేచ్చగా భూ దోపిడీలు, ఆరి్థక అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు భాగస్వాములు అందరూ రంగంలోకి దిగారు. మరోసారి చంద్రబాబుకు పీఠం దక్కితే గతంలో కొల్లగొట్టిన దానికంటే పది రెట్లు అధికంగా దోపిడీకి పాల్పడవచ్చన్న ఉద్దేశంతో అక్రమాలకు తెగబడ్డారు. రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్, పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు, పలువురు టీడీపీ నేతలకు చెందిన అక్వా కంపెనీలు, షిప్పింగ్ కంపెనీలు... ఇలా చంద్రబాబు ముఠాకు చెందిన వ్యాపార సంస్థలన్నీ నల్లధనం గిడ్డంగులుగా మారిపోయాయి.
ఆ సంస్థలకు హైదరాబాద్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని తరలించారు. వాటిని నల్లధనం స్టాక్ పాయింట్లుగా మార్చుకుని వివిధ మార్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించి భారీగా నోట్ల కట్టలను పంపిణీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలోని మార్గదర్శి బ్రాంచి నుంచి అక్రమంగా తరలిస్తున్న డబ్బులను పోలీసులు స్వా«దీనం చేసుకుని కేసు నమోదు చేయడం విదితమే. 2022 డిసెంబర్ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో కొత్త చిట్టీలు నిలిచిపోయాయి.
అయినా సరే రాష్ట్రంలోని 37 బ్రాంచీల ద్వారా నెలకు దాదాపు రూ.200 కోట్ల నగదు టర్నోవర్‌ను లెక్కల్లో చూపిస్తుండటం గమనార్హం. ఆ టర్నోవర్ ముసుగులో టీడీపీ కోసం భారీగా నల్లధనాన్ని తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ సీనియర్ నేత పొంగూరు నారాయణకు చెందిన విద్యా సంస్థలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఎన్‌సై్పరా అనే కంపెనీ ముసుగులో భారీగా నల్లధనాన్ని తరలించడం అధికారుల సోదాల్లో బట్టబయలైంది.
చంద్రబాబు బీజేపీ తరపున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిపిన సీఎం రమేశ్ ద్వారా భారీగా నల్లధనాన్ని డంప్ చేశారు. చంద్రబాబుకు సన్నిహితుడైన విశాఖకు చెందిన ఓ ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీ యజమాని ద్వారా నల్లధనం దందా సాగిస్తున్నారు. ఆయన కంపెనీ ఆరి్థక లావాదేవీల ముసుగులో భారీగా నల్లధనాన్ని షెల్ కంపెనీల నుంచి తరలించారు. అనకాపల్లి నియోజకవర్గంతోపాటు ఉత్తరాంధ్ర అంతటా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
అక్రమాలకు ప్రత్యేక జట్టు
ఎన్నికల అక్రమాల కోసం చంద్రబాబు ఏకంగా ఓ జట్టును ఏర్పాటు చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నల్లధనాన్ని తెప్పించడం.. ప్రతి జిల్లాలో ప్రత్యేక డంపింగ్ కేంద్రాల్లో భద్రపరచడం.. అక్కడ నుంచి నియోజకవర్గాలకు పంపిణీ.. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నేతలకు నోట్ల మూటలు ఇచ్చి లోబరచుకోవడం.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేయడం.. ఈ మొత్తం ప్రక్రియను ఈ జట్టు పర్యవేక్షిస్తుంది.
ఎస్వీయూలో తన సహ విద్యార్థిగా ఉన్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్, రాష్ట్ర విభజన అనంతరం పోలీస్ బాస్‌గా తాను నియమించిన అనంతపురం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఓ రిటైర్డ్ డీఐజీ, టీడీపీ ప్రభుత్వంలో ఆరి్థక వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ సలహాదారు తదితరులు ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. నల్లధనం, అక్రమ మద్యం పంపిణీ అంతా ఈ జట్టు కనుసన్నల్లోనే సాగుతోంది.
ఏదైనా చేయండి.. డీల్ సెట్ చేయండి!
టీడీపీ హయాంలో కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను చంద్రబాబు విదేశాల్లోని వివిధ కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించారు. ఎన్నికల అక్రమాల కోసం ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ పెద్దల కంపెనీలకు తరలించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.75 కోట్ల వరకు వెదజల్లేందుకు చంద్రబాబు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అభ్యర్థులకు రూ.25 కోట్ల వరకు, రాష్ట్ర పార్టీ కార్యాలయ బృందాల ద్వారా రూ.50 కోట్ల వరకు ఎన్నికల అక్రమాల కోసం వెదజల్లాలన్నది చంద్రబాబు స్కెచ్.
పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలకు రేటు నిర్ణయించేసి మరీ తమకు అనుకూలంగా మలచుకోవాలని హుకుం జారీ చేశారు. ‘పంచాయతీ స్థాయి నేతకు రూ.50 లక్షలు, మండల స్థాయి నేతకు రూ.కోటి, నియోజకవర్గ స్థాయి నేతకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఇచ్చేయండి..! ఏదైనా చేయండి.. డీల్ సెట్ చేయండి’ అని నిర్దేశించినట్లు సమాచారం. ఇక ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఓటుకు రూ.5 వేలు చొప్పున ఇవ్వడానికి వెనకాడొద్దని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment