కొనుగోళ్లు పునఃప్రారంభం | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు పునఃప్రారంభం

Published Tue, Apr 23 2024 8:25 AM

అధికారులతో మాట్లాడుతున్న వ్యాపారులు, రైతు సంఘం నాయకులు - Sakshi

జనగామ: వ్యవసాయ మార్కెట్‌లో నిలిచిపోయిన కొనుగోళ్లు ఎట్టకేలకు సోమవారం పునఃప్రారంభం అయ్యాయి. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశాల మేర కు అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌.. మార్కెటింగ్‌, సహకార, పౌరసరఫరాలు, మార్కెట్‌, జిల్లా గ్రామీ ణాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రైవేట్‌ కొనుగోళ్లు సైతం మంగళవారం నుంచి కనీస మద్దతు ధర రూ.1,825తో చేపట్టనున్నారు.

జనగామ వ్యవసాయ మార్కెట్‌లో తేమ సాకుతో ధాన్యాన్ని కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈనెల 11 నుంచి ప్రైవేట్‌ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లు ఏర్పా టు చేసిన అధికారులు ప్రభుత్వ కొనుగోళ్లకు మాత్ర మే అనుమతించారు. అంతకు ముందే మార్కెట్‌కు వచ్చిన సుమారు 25వేల ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. అయితే అవసరాల రీత్యా చాలా మంది రైతులు ప్రైవేట్‌లోనే ధాన్యం అమ్ముకునేందుకు ఆసక్తి చూపారు. అయితే ధాన్యం ఆరబోసుకుని తేమ 17 శాతం లోపు వచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు. రోజుల తరబడి నిరీక్షించే ఓపిక లేదని.. తేమను ప్రామాణికంగా తీసుకుని ధర ఇప్పిస్తే చాలని రైతులు కోరాగా అధికారులు సమ్మతించకపోవడంతో అన్నదాతలు మరోసారి మార్కెట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ఉన్న సరుకును మాత్రమే ప్రైవేట్‌ ట్రేడర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకుని.. ఈనెల 15 నుంచి కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో రైతులు ఇబ్బంది పడగా.. మార్కెట్‌పై ఆధారపడిన అడ్తిదారులు, హమాలీ, దడువాయి, స్వీపర్లు ఉపాధి కోల్పోయారు. కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిచి పోయినా రైతులు మార్కెట్‌కు ధాన్యం తీసుకురావడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో పరిస్థితులపై కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ ఆరా తీశారు. ట్రేడర్లు, అడ్తిదారులు, హమాలీల విజ్ఞప్తి మేరకు ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో ఏడు రోజుల తర్వాత మార్కెట్‌లో తిరిగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి చొరవ..

మార్కెట్‌లో ప్రైవేట్‌ కొనుగోళ్లు నిలిచిపోవడంపై డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాతో మాట్లాడి కొనుగోళ్లు జరిగేలా చూడాలని కోరారు. అంతకు ముందు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఇక్కడి సమస్య వివరించారు. మొదట ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు అంగీకరించిన అధికారులు.. ప్రైవేట్‌ వ్యాపారులతో సైతం చర్చలు జరిపి కొనుగోళ్లకు వచ్చేలా చూశారు.

ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌

అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్ష

మార్కెట్‌లో ఐకేపీ, పీఏసీఎస్‌ ద్వారా

ధాన్యం కొనుగోలుకు నిర్ణయం

నేటి నుంచి ప్రైవేట్‌ కొనుగోళ్లు కూడా..

ఎంఎస్‌పీ రూ.1,825తో సేకరణ

నేటి నుంచి ‘ప్రైవేట్‌’ కొనుగోళ్లు

కనీస మద్దతు ధర రూ.1,825తో..

అధికారులకు ఒప్పంద పత్రం అందజేత

మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారం సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందిస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించారు. సోమవారం రాత్రి డీఎంఓ నరేంద్ర, డీసీఎస్‌ఓ రోజారాణి, డీఏఓ వినోద్‌కుమార్‌, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మోకు కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌. రాజా రెడ్డి, చందునాయక్‌, వ్యాపారులు నాగబండి రవీందర్‌, వెంకటనారాయణ, యాంసాని శ్రీనివాస్‌, అశోక్‌, లింగం తదితరుల ఆధ్వర్యంలో ప్రైవేట్‌ కొనుగోళ్లపై మార్కెట్‌లో రెండు గంట ల పాటు చర్చలు జరిగాయి. ఈ–నామ్‌ పద్ధతిలో ధాన్యం క్వింటాకు కనీస మద్దతు ధర రూ.1,825 తో కొనుగోలు చేస్తామని వ్యాపారులు, రైతు సంఘం నాయకులు నిర్ణయించి ఒప్పంద పత్రాన్ని అధికారులకు అందజేశారు.

కోత పెడితే ఊరుకునేది లేదు :

అదనపు కలెక్టర్‌

రైస్‌ మిల్లులతో పాటు చిల్లర కాంటాల వ్యాపారంపై నిఘా పెట్టామని, సాకులు చూపి ధరలో కోత పెడితే ఊరుకునేది లేదని అదనపు కలెక్టర్‌ రోహిత్‌సింగ్‌ స్పష్టం చేశారు. డీఎంఓ నరేందర్‌, సహకా ర శాఖ అధికారి రాజేందర్‌రెడ్డి, డీసీఎస్‌ఓ రోజా రాణి, సివిల్‌ సప్లయ్‌ డీఎం ప్రసాద్‌తో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్కెట్‌లో పీఏసీఎస్‌, ఐకేపీ సెంటర్ల ద్వారా కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యంగా రైస్‌ మిల్లుల వద్ద వివిధ కారణాలతో తూకం, నగదు, ధరలో కోతపెట్టినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రశీదు ఇవ్వడంతోపాటు రోజువారీ కొనుగోళ్ల సమాచారం మార్కెట్‌ అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ప్రైవేట్‌ వ్యాపారులు సైతం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. మార్కెట్‌ ఆవరణతో పాటు పట్టణంలో చిల్లర కాంటాలపై దృష్టి సారించి సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోహిత్‌సింగ్‌
1/1

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోహిత్‌సింగ్‌

Advertisement
Advertisement