ఘరానా మోసం | Sakshi
Sakshi News home page

ఘరానా మోసం

Published Sat, Apr 20 2024 1:45 AM

పోలీసులకు పట్టుబడిన వంచకులు 
 - Sakshi

బనశంకరి: ఒక స్థలానికి సంబంధించి నకిలీ రికార్డులు సృష్టించి 22 బ్యాంకుల్లో రుణం తీసుకుని మోసం చేసిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని జయనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు ఒకే కుటుంబానికి చెందిన నాగేశ్‌ భరధ్వాజ్‌, అతని భార్య సుమా, ఆమె సోదరి వేద, భర్త శేషగిరి, తమ్ముడు సతీశ్‌, అతని స్నేహితుడు వేద ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం నగర సీపీ దయానంద్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు...ఒకే కుటుంబానికి చెందిన నాగేశ్‌ భరద్వాజ్‌ బేగూరు గ్రామంలో 2,100 అడుగుల స్థలానికి నకిలీ రికార్డులు సృష్టించి బ్యాంకులో కుదవపెట్టి బ్యాంకు నుంచి కంతుల వారీగా రుణం, యంత్రోపకరణాల కింద రూ.కోటి 30 లక్షలు రుణం తీసుకున్నారు. అనంతరం బ్యాంకుకు చెల్లించకుండా వంచనకు పాల్పడటంతో జయనగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన జయనగర ఏసీపీ నారాయణస్వామి ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్‌ బృందం శుక్రవారం నాగేశ్‌ భరద్వాజ్‌, భార్య సుమా దంపతులను అరెస్ట్‌చేసి విచారణ చేపట్టగా ఈ వంచనలో కుటుంబ సభ్యులందరూ ఉన్నట్లు వెలుగుచూడటంతో ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు.

ఖతర్నాక్‌ కుటుంబ సభ్యులు :

ఒకే స్థలానికి సంబంధించి సర్వే నెంబర్లు నమోదు చేసి పొడవు, వెడల్పులో మార్పులు చేసిన నకిలీ రికార్డులు సృష్టించి నాగేశ్‌ భరద్వాజ్‌, అతని భార్య సుమా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ విధంగా తన కుటుంబ సభ్యుల సహకారంతో పలు జాతీయ, సహకార బ్యాంకుల్లో కుదువపెట్టి మొత్తం 22 బ్యాంకుల నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకుని వంచనకు పాల్పడినట్లు తేలిందన్నారు. విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఒకే స్థలానికి నకిలీ రికార్డులు సృష్టించి 22 బ్యాంకుల నుంచి రుణం

కోట్లాది రూపాయల వంచన

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అరెస్ట్‌

Advertisement
Advertisement