ఫొటో మార్ఫింగ్‌.. సంతకం ఫోర్జరీ | Sakshi
Sakshi News home page

ఫొటో మార్ఫింగ్‌.. సంతకం ఫోర్జరీ

Published Thu, May 9 2024 12:45 AM

ఫొటో మార్ఫింగ్‌.. సంతకం ఫోర్జరీ

● రుణం కోసం పొదుపు సంఘం సాహసం ● పంపకంలో తేడా రావడంతో వెలుగులోకి ఉదంతం

ఇల్లెందురూరల్‌: రుణం చేతికందుతుందన్న తొందరలో ఓ సభ్యురాలి ఫొటో మార్ఫింగ్‌ చేయడంతోపాటు సంతకం కూడా ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఇందిరానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని పది మంది సభ్యులున్న శ్రీఆంజనేయం పొదుపు సంఘానికి సుదిమళ్ల ఎస్‌బీఐ నుంచి ఏడాది కిందట రూ.10 లక్షలు బ్యాంకు లింకేజీ పేరుతో రుణం మంజూరైంది. ఈ సొమ్మును గ్రూపులోని కొందరు సభ్యులు పంచుకుని, క్రమం తప్పకుండా ఏడాదిపాటు అసలుతోపాటు వడ్డీ కలిపి మొత్తం రూ.2.50 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట సుదిమళ్ల బ్యాంకు అధికారులు అదే గ్రూపునకు రూ.15 లక్షలు బ్యాంకు లింకేజీ రుణం మంజూరు చేశారు. దీనికోసం డాక్యుమెంటేషన్‌ సిద్ధం చేయాలని సెర్ప్‌ అధికారులకు, గ్రూపు సభ్యులకు సూచించారు. ఇదిలా ఉండగా గ్రూపులోని పది మంది సభ్యుల్లో ఒకరు స్థానికంగా ఉండటం లేదు. దీంతో డాక్యుమెంటేషన్‌ పూర్తి చేయడం గ్రూపు సభ్యులకు ఇబ్బందిగా మారింది. అయితే, స్థానికంగా లేని సభ్యురాలి సోదరి ఉండటం, ఆమె వద్ద తన సోదరి ఫొటో ఉండటంతో తొమ్మిది మంది సభ్యులు దిగిన ఫొటోలో స్థానికంగా లేని సభ్యురాలి ఫొటోను మార్ఫింగ్‌ చేయించారు. డాక్యుమెంటేషన్‌లో ఆమె సంతకాన్ని గ్రూపు సభ్యులే ఫోర్జరీ చేసి రుణం మంజూరు కోసం బ్యాంకులో అందజేశారు. డాక్యుమెంటేషన్‌ పరిశీలించిన బ్యాంకు అధికారులు గతంలో తీసుకున్న రుణంలో మిగిలిపోయిన రూ.7.50 లక్షలను మినహాయించుకొని మిగతా రూ.7.50 లక్షలను పొదుపు సంఘం సభ్యులకు మంజూరు చేశారు. సంబంధిత సొమ్మును సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇదిలా ఉండగా అకౌంట్లలో జమ అయిన సొమ్మును పంచుకోవడంలో సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. గతంలో మంజూరైన రుణంలో రూ.లక్ష తీసుకొని పూర్తిస్థాయిలో చెల్లించకుండానే ఓ సభ్యురాలు ఊరు విడిచి వెళ్లిపోవడంతో రికవరీ ఇబ్బందిగా మారుతుందన్న ఆందోళనతో ఆమెకు తిరిగి రుణం ఇచ్చేందుకు మిగతా సభ్యులు నిరాకరించారు. దీంతో సదరు సభ్యురాలు రుణం మంజూరు కోసం సభ్యులందరూ కలిసి చేసిన ఫొటో మార్ఫింగ్‌, సంతకం ఫోర్జరీ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆనోట.. ఈనోట విషయం తెలుసుకున్న సుదిమళ్ల ఎస్‌బీఐ, సెర్ప్‌ అధికారులు జరిగిన తప్పిదాన్ని సరిచేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సభ్యులందరినీ సమావేశపర్చి చర్చించారు. మంజూరైన నిధులు డ్రా చేయకుండా వారి అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారు. తీసుకున్న రుణం మొత్తం రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు షరతు పెడుతుండగా ఒకే సారి చెల్లించలేమని, తాజాగా మంజూరైన రూ.7.50 లక్షలు మాత్రమే వెంటనే చెల్లిస్తామని పొదుపు సంఘం సభ్యులు బదులిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పొదుపు సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది.

మార్ఫింగ్‌ చేసినట్లు గుర్తించాం..

బ్యాంకు లింకేజీ రుణం మంజూరు కోసం పొదుపు సంఘం సభ్యులు ఓ సభ్యురాలి ఫొటోను మార్ఫింగ్‌ చేసినట్లు గుర్తించాం. బ్యాంకు అధికారులతో సభ్యుల అకౌంట్లను ఫ్రీజ్‌ చేయించాం. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.

–దుర్గారావు, ఏపీఎం, ఇల్లెందు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement