Ram Gopal Varma: అర్థం కానీ డిక్షనరీ.. తెలివైన స్వేచ్ఛా జీవి | Sakshi
Sakshi News home page

HBD RGV: ‘కాంట్రవర్సీ కింగ్’ ఆర్జీవీ గురించి ఈ విషయాలు తెలుసా?

Published Sun, Apr 7 2024 9:57 AM

HBD RGV: Interesting Facts About Ram Gopal Varma - Sakshi

అతనో అర్థం కానీ డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నచ్చని పని చెయడు. నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తాడు. వోడ్కా తాగుతూ సరదాగా ట్వీట్‌ చేసి..సంచలనంగా క్రియేట్‌ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్‌తోనే సినిమా తీసి.. ‘నచ్చితే చూడండి లేకపోతే లేదు’అంటూ కుండ బద్దలు కొట్టేసినట్లు చెప్పేస్తాడు. ఆయనను తిట్టేవాళ్లు ఉన్నారు.. పొగిడేవాళ్లు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా  స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్‌గోపాల్‌ వర్మ అలియాస్‌ ఆర్జీవీ. నేడు(ఏప్రిల్‌ 7) అతితెలివైన ఈ ఇన్నోసెంట్ ఫెల్లో బర్త్‌డే. ఈ సందర్భంగా ఆర్జీవీ గురించి ఆసక్తికరమైన విషయాలు.. 

వర్మ స్వస్థలం విజయవాడ. 1962 ఏప్రిల్‌ 7న హైదరాబాద్‌లో జన్మించాడు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను, విజయవాడనగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. 

► చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్‌ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్లేవాడట. ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు. క్లాసులను ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవారు. షోలే సినిమాలో "ఫిల్మ్ బై రమేష్ సిప్పీ" పేరు చూసి ఎప్పటికైన తన పేరు కూడా అలానే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడట.

► ఇంజనీరింగ్‌ పూర్తయిన తర్వాత బతుకుదెరువు కోసం డీవీడీలు, వీసీఆర్‌లు రెంట్‌కి ఇచ్చే దుకాణం పెట్టుకొని.. సినిమా చాన్స్‌ల కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘రావుగారిల్లు’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత నాగార్జున తో పరిచయం అతని జీవితాన్ని మార్చివేసింది. 

► శివతో సంచలనం: ఆర్జీవీ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగార్జునతో సైకిల్‌ చైన్‌ లాంగించి  ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టబ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.మ్యాటనీ ఆట ఉంది… బోటనీ క్లాసు ఉంది దేనికో ఓటు చెప్పరా అంటూ కుర్రాళ్లను తెగ కన్ఫూజ్ చేశాడు.సినిమా అంటే ఇలానే తీయాలనే కట్టుబాట్ల బంధీలను బద్దలు కొట్టాడు, తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు.ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తే..అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. 

► ఆ తర్వాత వెంకటేశ్‌, శ్రీదేవి జంటగా తీసిన క్షణక్షణం మూవీ ఆద్యంతం కొత్త స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంక్ దొంగతనం నేపథ్యంతో తీసిన ఈ చిత్రం సైతం సూపర్ హిట్ గా నిలిచింది.

► 1993లో రాము, మణిరత్నం తో కలిసి తీసిన ‘గాయం’ జగపతిబాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్ లో తీసిన ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు అందుకున్నాడు.

► నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా…గోవిందా మూవీ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో విలన్లు వేంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారమే రేపింది. సెన్సార్ కత్తెర పడటంతో వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలు పెట్టాడు.

► బాలీవుడ్‌పై దండయాత్ర: రంగీలా చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు ఆర్జీవీ. అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిలా హీరో హీరోయన్లుగా వర్మ తీసిన ఈ చిత్రం 1994లో రిలీజై.. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రంతోనే ఎ.ఆర్.రెహమాన్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. 

► ఆర్జీవీ దర్శకత్వం వహించిన సూపర్‌ చిత్రాల్లో సత్య ఒకటి.  తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ మూవీ ఎంతో మంది నటులకు,  సాంకేతికి నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే మనోజ్ బాజ్ పాయి, చక్రవర్తి వంటి నటులు వెండితెరకు పరిచయం అయ్యారు.

► ఆ తర్వాత వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అజయ్‌ దేవగన్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. 

► అమితాబ్ తో తీసిన ‘సర్కార్’ చిత్రం రాము తీసిన మంచి చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్, అభిషేక్ లు తెరపై కూడా తండ్రీ కొడుకులుగా నటించిన ఈ మూవీ తరువాత బాలీవుడ్ ను వర్మవుడ్ గా మార్చాడనే కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీం పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్కార్ రాజ్’ కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ ‘సర్కార్ 3’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

►  ‘రక్త చరిత్ర’ తర్వాత ఆర్జీవీ తెలుగులో వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలతోనే సినిమాలను తెరెక్కిస్తున్నాడు. అయితే వాటిల్లో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండితెరపై ఏదైన కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికీ ఎవరైనా ఆర్జీవీ తర్వాతనే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు.

Advertisement
Advertisement