10 ‘వందే భారత్‌’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా! | Sakshi
Sakshi News home page

Ahemdabad: 10 ‘వందే భారత్‌’లకు ప్రధాని మోదీ పచ్చ జెండా!

Published Tue, Mar 12 2024 11:25 AM

Narendra Modi Flags Off 10 New Vande Bharat Trains - Sakshi

దేశంలోని ‍ప్రజలకు మరో పది నూతన వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 నూతన వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఇతర రైల్వే సేవలను కూడా స్వాగతించారు.  

‘రైల్వేని నరకం నుంచి బయటపడేశాం’
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతీయ రైల్వేలను నరకం లాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. తమ సంకల్ప శక్తికి సజీవ నిదర్శనం రైల్వేల అభివృద్దేనని అన్నారు. దేశంలోని యువత ఎలాంటి దేశం, ఎలాంటి రైళ్లు కావాలో నిర్ణయించారన్నారు. తమ ఈ  పదేళ్ల కృషి కేవలం ట్రైలర్ మాత్రమేనని, మనం మరింత ముందుకు సాగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ కూడా పాల్గొన్నారు.


10 రైళ్ల వివరాలు ఇవే.. 

అహ్మదాబాద్-ముంబై సెంట్రల్

సికింద్రాబాద్-విశాఖపట్నం

మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై)

పాట్నా- లక్నో

న్యూ జల్పాయిగురి-పాట్నా

పూరీ-విశాఖపట్నం

లక్నో – డెహ్రాడూన్

కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు

రాంచీ-వారణాసి

ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)

మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్‌ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు.

ప్రారంభించిన కిషన్‌రెడ్డి
సికింద్రాబాద్ - విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా... సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చ జెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి ఆరు రోజుల పాటు ఈ రైలు రెండు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మూడో వందేభారత్ రైలు ఇది. సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య రెండో రైలు కాగా... మరొకటి సికింద్రాబాద్- తిరుపతి మధ్య తిరుగుతోంది.

మహాత్మునికి ప్రధాని మోదీ నివాళులు
అహ్మదాబాద్‌లోని సబర్మతిలోగల మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొచరబ్ ఆశ్రమాన్ని, గాంధీ ఆశ్రమం మెమోరియల్ మాస్టర్ ప్లాన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. నేడు (మంగళవారం) ప్రధాని మోదీ గుజరాత్, రాజస్థాన్‌లలో పర్యటిస్తున్నారు.
 

Advertisement
Advertisement