అమెరికాలో మన గిరాకీ! | Sakshi
Sakshi News home page

అమెరికాలో మన గిరాకీ!

Published Thu, Apr 11 2024 3:45 PM

India US ties are getting stronger day by day says journalist m sharma - Sakshi

భారత్ - అమెరికా బంధాలు రోజు రోజుకు గట్టిపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పీవీ నరసింహారావు వేసిన పునాదులపైన ఆ బంధాలు మరింత దృఢపడుతున్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అగ్రరాజ్యంలో ఎవరు అధికారంలో వున్నా, భారతీయులు కీలక భూమిక పోషిస్తున్నారు. పాలనలో,రాజకీయాలలోనూ,ఐటీ పరిశ్రమలోనూ, ఆ దేశ ఆర్ధిక వృద్ధిలోనూ మన పాత్ర ప్రశంసాపాత్రంగా ఉంటోంది. తాజాగా భారత్ పై అమెరికా రాయబారి కురిపించిన ప్రశంసలు, చేసిన వ్యాఖ్యలు ఈ తీరుకు అద్దం పడుతున్నాయి. ఎవరైనా అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరుతారు!

అమెరికా రాయబారి ఎరిక్ గార్శెట్టి మాత్రం భవిష్యత్తును దర్శనం చేసుకోవాలంటే భారత్‌కు రండి..అంటూ పిలుపునిచ్చారు.ఎరిక్ ప్రస్తుతం అమెరికా రాయబారిగా మన దేశంలో వున్నారు. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపన్యాసం అందించారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు  ఆసక్తికరంగా మారాయి.ప్రపంచ దేశాలు అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టాయి. "మేం ఇక్కడికి  పాఠాలు బోధించేందుకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చాం "  అని ఆయన అన్నారు.

ఇరు దేశాల మధ్య అవగాహన కూడా బాగా పెరుగుతూ వస్తోందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో భారతీయుడుపై అభియోగాలు వచ్చాయి. ఈ అంశం రెండు దేశాల బంధంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో? అనే చర్చ పెద్దఎత్తున జరుగుతూనే వుంది.అయితే! ఈ కేసు దర్యాప్తు విషయంలో భారత్ అందిస్తున్న సహకారాన్ని అమెరికా మెచ్చుకుంటోంది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ కూడా అమెరికా -భారత్ బంధం పట్ల గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేయడం కూడా గమనార్హం. రిచర్డ్ నిక్సన్ - ఇందిరాగాంధీ సమయంలో ఇరు దేశాల మధ్య  బంధాలు ఏ మాత్రం బాగా ఉండేవి కాదు. పీవీ నరసింహారావు అద్భుతమైన బంధాన్ని ఏర్పరచారు. మన్మోహన్ సింగ్ అదే దారిలో నడిచారు. బుష్- సింగ్ కాలంలో ఈ స్నేహం ఎంతో వికసించింది. నరేంద్రమోదీ - డోనాల్డ్ ట్రంప్ సమయంలో మరింత ఆత్మీయంగా మారింది.  జో బైడెన్ మొదటి నుంచి భారత్ పై ప్రత్యేకమైన అభిమానం,గౌరవం చూపిస్తూ వస్తున్నారు. ఆయన అధ్యక్షుడుగా అధికార పీఠం అధిరోహించినప్పటి నుంచి మరింత  ప్రభావశీలంగా సాగుతోంది. బరాక్ ఒబామా పరిపాలనా కాలంలోనూ బాగా నడిచింది.

డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడుగా అధికారం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. జో బైడెన్ -ట్రంప్ మధ్య పెద్ద పోటీ నడుస్తోంది. భవిష్యత్తు ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇరుదేశాల ప్రయాణానికి ఎటువంటి ఢోకా ఉండదని అంచనా వెయ్యవచ్చు. వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, భద్రతా సహకారం మొదలైన విషయాల్లో భారత్ వైపు అమెరికా గట్టిగా నిలబడుతోంది. ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య వేదికలలో భారతదేశ స్థాయిని, ప్రాతినిధ్యాన్ని  పెంచడంలో అమెరికా కీలక భూమిక పోషిస్తోంది. ఎగుమతులు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి తయారీ అంశాల్లోనూ అగ్రరాజ్యం మనకు  సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది.

ప్రపంచంలో తమకు ఎంతో ఇష్టమైన దేశాలలో భారత్ తొలివరుసలో ఉంటుందని అమెరికా ప్రజలు అంటున్నారు. వస్తువులు, సేవలు రెండింటిలోనూ ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూ రావడం శుభ పరిణామం.బ్రిటిష్ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యానంతర భారతంలోనూ చాలా ఏళ్ళు  రెండు దేశాల మధ్య బంధాలు అంత ఆరోగ్యం లేవన్నది పచ్చినిజం. ముఖ్యంగా ఈ రెండు దశాబ్దాలలో ఆరోగ్యకరమైన బంధాలు సాగుతున్నాయి. మన దేశానికి ప్రత్యక్ష పెట్టుబడులు అందించే దేశాలలో అగ్రరాజ్యానిది విశిష్టమైన స్థానం.వాణిజ్య భాగస్వామిగా అమెరికాది రెండో స్థానం.అమెరికాలో మన భారతీయుల జనాభా సుమారు 1.35 శాతం వున్నట్లు సమాచారం.ఆ దేశంలో బాగా సంపాయిస్తున్న జాతుల్లో భారత జాతీయులకు సమున్నత స్థానం వున్నది.మన తెలుగువారి స్థానం గణనీయం.అక్కడ మన దేశ భాషలు మాట్లాడేవారిలో అందరికంటే అగ్రస్థానం తెలుగు వారిదే. ఆ తర్వాత తమిళ, బెంగాలీలు వస్తారు. ఆ తర్వాతి స్థానంలో హిందీ వుంది.1910 ప్రాంతంలో  అమెరికాలోని భారతీయుల జనాభా కేవలం 2,545.2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50లక్షలమంది వున్నారు.ఈ నాలుగేళ్లలో ఇంకా పెరిగారు.

సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధిలోకి వచ్చాక అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.2000ప్రాంతంలో మనవారు సుమారు 90వేల మంది ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 12లక్షల 40వేలకు పెరిగింది. వీరిలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా ఉంటారు. వివిధ రంగాల్లో అక్కడ రాణిస్తున్న మనవాళ్ళ పేర్లు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది. అయితే! మనవాళ్ళపై జాతి విద్వేషాలు, వైషమ్యాలు జరుగుతూనే వున్నాయి. అవి ఆగాలి. వీసా ఇబ్బందులు తీరడం లేదు.అవి తీరాలి. ఉద్యోగాల కల్పనలోనూ,జీత భత్యాల విషయంలోనూ అసమానతలు పెరుగుతూనే వున్నాయి. వీటికి చరమగీతం పాడాలి.ప్రపంచంలోనే భారత్ ది అతి పెద్ద మార్కెట్. జనాభాలో త్వరలోనే చైనాను సైతం మనం అధిగమిస్తాం. ఎల్లకాలం అగ్రరాజ్యంగా ఉండాలన్నది అమెరికా ఆశ. చైనాను దెబ్బకొట్టాలన్నది మరో వ్యూహం. ఇస్లాం తీవ్ర వాద భయాలు కూడా ఆ దేశానికి బాగా వున్నాయి. 

ప్రపంచ దేశాల ప్రయాణంలో భారత్ తో స్నేహం, సహకారం అమెరికాకు ఎంతో అవసరం.ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వార్థంతో, మన దేశంతో అమెరికా గట్టి బంధాలను కోరుకుంటోంది. మనకు కూడా ఆ దేశంతో ఎంతో అవసరం ఉంది. అనేక అంశాలలో రెండు దేశాలు కలిసి సాగాల్సిన చారిత్రక అవసరాలు వున్నాయి.మానవవనరుల అభివృద్ధిలో మన ప్రయాణం ఆ దేశానికి ఎంతో నచ్చింది. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణులు మరింత పెరగాలి. మనం భవిష్యత్తులో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తే? అప్పుడు అమెరికా మనతో ఎలా ఉండబోతుందో కాలచక్రంలోనే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే, అమెరికా దృష్టిలో మన గిరాకీ పెరిగింది.

-మాశర్మ

Advertisement
Advertisement