మేమే కాదు.. ఎవ్వరినీ ముట్టుకోనివ్వం.. రిజర్వేషన్లపై అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

మేం మార్చాం.. ఎవ్వరినీ ముట్టుకోనివ్వం.. రిజర్వేషన్లపై అమిత్‌ షా

Published Fri, Apr 19 2024 1:53 PM

Amit Shah:BJP Never change Reservation Wont Let Anyone Eelse Touch It - Sakshi

న్యూఢిల్లీ రిజర్వేషన్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కుల ఆధారిత రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని అన్నారు. అంతేగాక ఎవరిని కూడా మార్చేందుకు అవకాశం ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

భారీ మెజారిటీతో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉందంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై అమిత్‌ షా స్పందించారు.  2014, 2019లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, ఆయినా తాము రాజ్యాంగాన్ని మార్చే యోచన చేయలేదని చెప్పారు. ‘నేను స్పష్టంగా చెబుతున్నా. మేము(బీజేపీ) ఎప్పటికీ రిజర్వేషన్‌ను మార్చబోము.. ఎవరినీ చేయనివ్వం. ఇది ప్రజల పట్ల మా నిబద్ధత. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మోదీజీ అత్యధికంగా కృషి చేశారు’ అని తెలిపారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారత్‌లో బీజేపీ పుంజుకుందని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ పటిష్ట పనితీరు కనబరిచినట్లు తెలిపారు. దక్షిణాదిలో ప్రధాని మోదీ ప్రజాదరణ పెరిగిందని, ఇది ఈ ఎన్నికల ఫలితాల్లో నిరూపితమవుతుందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ షేర్‌ను మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. అయితే తాము సీట్లు గెలుచుకునే స్థాయి చేరుకోలేదని అన్నారు. కానీ ఈ సారి తమ అభ్యర్ధులు చాలా చోట్ల గెలిచి తీరుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

నామినేషన్‌ దాఖలు
లోక్‌ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన మరోసారి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. అమిత్ షా తరపున గుజరాత్ సీఎం పటేల్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.

కాగా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement