మీ మేనిఫెస్టోలు, మా ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? | Sakshi
Sakshi News home page

మీ మేనిఫెస్టోలు, మా ఆరు గ్యారంటీలపై చర్చకు సిద్ధమా?

Published Tue, Feb 27 2024 2:04 AM

Revanth Reddy challenges BJP and BRS to discuss manifestos in special Assembly session - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2014, 2018 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రకటించిన మేనిఫెస్టోలు, 2014, 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చిద్దామని, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు సిద్ధమా? అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమ లు చేస్తున్నామని, గత పదేళ్లలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని చెప్పా రు. బీఆర్‌ఎస్, బీజేపీల భాష, భావం, ఆలోచనా విధానం ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు.

సోమవారం సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డ రోజున అప్పుల కింద ఏడాదికి రూ. 6 వేల కోట్లు కట్టేవారమని, ఇప్పుడు పదేళ్ల తర్వాత ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పుల కింద కట్టాల్సి వస్తోందని చెప్పారు. మిగులు బడ్జెట్‌ స్థితిలో రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే రాష్ట్రాన్ని దివాలా స్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. ఇంత త్వరగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయగల శక్తి కేసీఆర్‌కు తప్ప ఎవరికైనా ఉందా అని ఎద్దేవా ఏశారు.  

మార్చి 31 కల్లా రైతుబంధు 
రైతుబంధును మార్చి 31 కల్లా రైతులకు ఇస్తామని అసెంబ్లీలోనే చెప్పానని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రైతుబంధును 15 రోజుల్లోనే ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు నిధులివ్వలేమని వెల్లడించారు. ఉద్యోగాలను వారు వదిలేస్తే న్యాయ పరిష్కారం చూపెట్టి 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు తెడ్డు తిప్పుతున్నారని హరీశ్‌రావు అంటున్నారని, మరి తెడ్డు తిప్పలేని సన్నాసి మంత్రి ఎలా అయ్యా రని ఎద్దేవా చేశారు.

మార్చి 2న మరో ఆరువేల ఉద్యోగాలిస్తామని, 70 రోజుల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. దూలం లెక్క పెరిగిన హరీశ్‌కు దూడకున్న బుద్ధి కూడా లేదని విమర్శించారు. రేవంత్‌ను సీఎంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా వచ్చేవి కాదన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. గత ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా, కిషన్‌రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా తలపడ్డామని, తమ పార్టీ నేతలతో కలిసి 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలకు వెళ్లానని, పార్టీ అధ్యక్షుడంటే ఇంటి పెద్దే కదా అని అన్నారు.  

కిషన్‌రెడ్డి ఏనాడైనా కలిశారా? 
అధికారం చేపట్టిన తర్వాత రాజకీయాలకతీతంగా తాము నిధుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం వద్దకు వెళ్లామని, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏ రోజైనా ప్రజా సమస్యల కోసం తనను కలిశారా అని రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలన్న ఆలోచన బీజేపీకి లేదని విమర్శించారు. మూడోసారి ప్రధానిగా మోదీకి ఎందుకు అవకాశం ఇవ్వాలని, రైతులను కాల్చిచంపడానికా అని అన్నారు.  

నిరుద్యోగులకు ఆన్‌లైన్‌ క్లాసులు 
పేద, గ్రామీణ నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్ల పేరిట అత్యవసరంగా ఆడిటోరియాలు కట్టి, అక్కడ ఆన్‌లైన్‌ క్లాసులతో శిక్షణనిస్తామని రేవంత్‌ చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు తెల్ల రేషన్‌కార్డును కొలబద్దగా తీసుకున్నామని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా అనర్హులకు రూ.22వేల కోట్లు పంచిపెట్టారన్న అంచనా ఉందన్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాల కోసం ఆధార్‌కార్డు చూపిస్తే నమోదు చేసుకునేలా మండల కేంద్రాల్లో హెల్ప్‌ డెసు్కలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉజ్వల్‌ పథకం కింద కేంద్రం ఇస్తున్న మొత్తం పోను మిగిలింది సిలిండర్‌ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement