Visakhapatnam: నాన్‌ లోకల్‌ నాడు వద్దు.. నేడు ముద్దు  | Sakshi
Sakshi News home page

Visakhapatnam: నాన్‌ లోకల్‌ నాడు వద్దు.. నేడు ముద్దు 

Published Thu, Apr 25 2024 4:15 PM

TDP Leaders Internal Fight In Visakhapatnam - Sakshi

స్థానికేతరుడన్న నెపంతో బైరా దిలీప్‌పై వ్యతిరేకత 

అదే స్థానంలో కడప జిల్లా వాసి సి.ఎం.రమేష్​​ ​తో చెట్టాపట్టాలు     

పెందుర్తిలో తరిమేసిన బండారుకు మాడుగుల సీటుపై స్థానిక నేతల్లో అసంతృప్తి 
    
మచిలీపట్నానికి చెందిన పంచకర్లకు పెందుర్తి టికెట్‌ ఇవ్వడంపై కినుక 

భస్మాసుర హస్తంలా పరిణమించిన అయ్యన్న నాన్‌ లోకల్‌ వ్యతిరేక నినాదం 

విశాఖ సిటీ: నాన్‌ లోకల్‌ అంశం అనకాపల్లి తెలుగుదేశానికి శరాఘాతంగా మారింది. స్థానికేతరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని అయ్యన్నపాత్రుడు ఇచ్చిన పిలుపే.. ఇపుడు ఆ పార్టీని భస్మాసుర హస్తంలా వెంటాడుతోంది. కూటమి తరపున ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే స్థానాలను స్థానికేతరులకే కేటాయించడం టీడీపీ శ్రేణులకు మింగుపడడం లేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన స్థానిక నేతలకు మొండిచెయ్యి చూపించి.. ఆర్థిక నేరగాళ్లు, జనామోదం లేని నాన్‌లోకల్స్‌కు టికెట్లు కట్టబెట్టడంతో ఆ పార్టీ ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్యాకేజీలు పుచ్చుకొని, తమ స్వార్థానికి పార్టీ ప్రయోజనాలను బలి చేస్తున్నారని, కింది స్థాయి క్యాడర్‌కు అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయ్యన్న నాన్‌ లోకల్‌ బాణం తిరిగి తిరిగి తమ  పార్టీకే తగులుతోందని టీడీపీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి. 

బైరాపై స్థానికేతర ముద్ర 
అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరా దిలీప్‌ చక్రవర్తి ఆశించారు. చంద్రబాబు కూడా ప్రారంభంలో బైరా వైపే మొగ్గు చూపారు. అయితే ఈ స్థానం తన కుమారుడికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబట్టారు. చంద్రబాబు సమక్షంలో జరిగిన బహిరంగ సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. అనకాపల్లి ఎంపీ స్థానాన్ని తన కుమారుడికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బైరా దిలీప్‌ స్థానికేతరుడని, అతడిని అనకాపల్లి జిల్లావాసులు ఆదరించరని బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా స్థానికేతరులను జిల్లా నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపిచ్చారు.

పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ స్థానం బీజేపీ వశమైంది. బీజేపీ నుంచి కడప జిల్లా వాసి సి.ఎం.రమేష్‌ ఎన్నికల బరిలో దిగారు. స్థానికేతరుడన్న నెపంతో బైరాను వ్యతిరేకించిన అయ్యన్న.. నాన్‌ లోకల్‌ అయిన సి.ఎం.రమేష్‌తో రాసుకు పూసుకొని తిరగడం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఆర్థిక నేరగాడిగా ముద్ర పడిన సి.ఎం.రమేష్​​​​ తో సన్నిహితంగా మెలుగుతుండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ఈ దోస్తీ వెనుక ‘భారీ’ వ్యవహారమే నడిచిందన్న చర్చ ఆ పారీ్టలో జరుగుతోంది. 

రెండు అసెంబ్లీ స్థానాల్లో స్థానికేతరులే.. 
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి స్థానికేతర అంశం ప్రజల్లోకి వెళ్లకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కిందామీద పడుతున్న టీడీపీ నాయకులకు.. మరో రెండు అసెంబ్లీ స్థానాలను సైతం స్థానికేతరులకే కేటాయించడం మరింత తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో పెందుర్తిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌ చేతుల్లో ఓడిపోయిన బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి కూడా ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ప్రతికూలంగా రిపోర్టు రావడంతో చంద్రబాబు అతడికి టికెట్‌ నిరాకరించారు. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో బండారు అలకపాన్పు ఎక్కారు.

ఈ క్రమంలో సి.ఎం.రమేష్‌ బండారుతో చర్చలు జరిపి చంద్రబాబుతో రహస్య భేటీ ఏర్పాటు చేయించి మాడుగుల టికెట్‌ వచ్చేలా చక్రం తిప్పారు. దీంతో స్థానికులైన గడిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్‌లను పక్కనపెట్టి పెందుర్తిలో తరిమేసిన మరో స్థానికేతరుడిని మాడుగులకు తీసుకువచ్చారు. అలాగే పెందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌బాబు కూడా మచిలీపట్నానికి చెందిన నేత. ఇలా మరో రెండు స్థానాలను కూడా నాన్‌లోకల్స్‌కు టికెట్లు కేటాయించడం ఆ పార్టీ ఆశావహులకు మింగుడుపడడం లేదు. 
 
నోరు మెదపని అయ్యన్న.. 
బైరా విషయంలో స్థానికేతరుడని ఘాటు విమర్శలు చేసిన అయ్యన్న పాత్రుడు ఇపుడు మాడుగుల, పెందుర్తి టికెట్లు నాన్‌లోకల్స్‌కు కేటాయించినా నోరు మెదపకపోవడం గమనార్హం. నాన్‌లోకల్స్‌ను జిల్లా నుంచి తరిమికొట్టాలని అయ్యన్న ఇచ్చిన పిలుపు.. ఇపుడు ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. స్థానికేతర ముద్ర పడకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. తన కొడుకు టికెట్‌ కోసం అయ్యన్న వేసిన ఎరకు టీడీపీ అభ్యర్థులే చిక్కారంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నాన్‌లోకల్‌ అంశం ప్రజల్లోకి వెళితే ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్నారు. 
 

Advertisement
Advertisement