ఆయన నమ్మరు.. ఆయన్ను నమ్మరు | Sakshi
Sakshi News home page

ఆయన నమ్మరు.. ఆయన్ను నమ్మరు

Published Mon, Apr 1 2024 10:56 AM

TDP Leaders Opposing To Kavya Krishna Reddy - Sakshi

కావ్య అభ్యర్థత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాయకులు, కార్యకర్తలు

 
ఎన్నికల కార్యాచరణకు మిత్రపక్షాలు, పార్టీ కేడర్‌ను దూరం పెట్టిన వైనం 

పెత్తనమంతా గుమాస్తాల చేతిలోనే.. 

చంద్రబాబు సభకు జనసమీకరణకు ముఖం చాటేసిన నేతలు 

ప్రజాగళం అట్టర్‌ ఫ్లాప్‌తో కావ్య శిబిరం డీలా 

కావ్య ఎంట్రీతో కావలిలో టీడీపీ గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయింది. కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వంతో టీడీపీ భవితవ్యం తేలిపోయింది. చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభతో అది ప్రస్ఫుటమైంది. కావ్యను టీడీపీ కేడర్‌ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన తన క్వారీల్లో పని చేసే సిబ్బందితో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో టీడీపీ వీరాభిమానులను సైతం కావ్య పక్కన పెట్టేశారు. టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలను సైతం దూరంగా ఉంచారు. ఎన్నికల కార్యాచరణలో వీరిని దూరంగా పెట్టి.. తన గుమాస్తాల చేతికే పెత్తనమంతా కట్టబెట్టారు. ఖర్చులకు సైతం డబ్బులివ్వకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌ కావ్యను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే చంద్రబాబు సభకు జనసమీకరణకు కూటమి నేతలు ముఖం చాటేయడంతో ప్రజాగళం అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

కావలి: టీడీపీ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏక్‌ నిరంజన్‌గా మిగిలిపోయాడు. ఆయన నేతలను నమ్మడం లేదు. నేతలు ఆయన్ను నమ్మడం లేదు. కావ్య అభ్యర్థత్వాన్ని టీడీపీ నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. టికెట్‌ రేస్‌లో పోటీపడి చివరకు సీటు దక్కించుకున్నాడు. అయితే ఎన్నికల కార్యాచరణలో తన గెలుపు కంటే.. తన వద్ద ఉండే డబ్బు కోసమే పని చేస్తారనే ఆలోచనతో సొంత పార్టీ నేతలనే కాదు.. మిత్రపక్షాలను సైతం దూరం పెట్టేశాడు. తన వద్ద పని చేసే ఉద్యోగులు, దగ్గరి బంధువులతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోదామని ప్రయత్నించినా మిత్ర పక్షాలకు, పార్టీ కేడర్‌కు కావ్య వర్గం నుంచి ప్రతి రోజూ అవమానాలు ఎదురవుతుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. 

కావ్య శిబిరంలో కలవరం 
టీడీపీ అధినేత చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో కావ్య శిబిరంలో కలవరం మొదలైంది. ముందుగానే ప్రజాగళం షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ జన సమీకరణ చేయడంలో చతికిల పడ్డారు. జన సమీకరణ పేరుతో డబ్బులు తినేస్తారనే భావనతో కావ్య ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన బాధ్యతలను కార్యకర్తలు, నాయకులను కాదని తన క్వారీల్లో పని చేసే గుమాస్తాలకు, తన దగ్గరి బంధువులకు అప్పగించారు. తమపై నమ్మకం లేక గుమాస్తాలకు బాధ్యతలు అప్పగించిన వ్యక్తి కోసం తాము ఎందుకు పని చేయాలంటూ సొంత పార్టీ కేడర్‌తో పాటు మిత్రపక్షాలు బీజేపీ, జనసేన సైతం ముఖం చాటేశారు.

కావ్య అహంకార వైఖరితో ఇప్పటికే నియోజకవర్గంలో బీద రవిచంద్ర వర్గీయులు, మాలేపాటి వర్గీయులు పారీ్టకి దూరదూరంగా ఉంటున్నారు. ఎవరూ సహకారం అందించకపోవడంతో తన దళాలను రంగంలోకి దింపి జన సమీకరణకు సిద్ధమయ్యారు. అసలే టీడీపీ సభలంటే జనం ముఖం చాటేస్తున్నారు. చంద్రబాబు హెలికాప్టర్‌ దిగినా.. జనం లేకపోవడంతో గంటా పది నిమిషాలు హెలిప్యాడ్‌లో ఉన్న బస్సులోనే పడిగాపులు పడ్డారు. ఎట్టకేలకు వెయ్యి.. రెండు వేల మందిని సభా స్థలికి చేర్చడంతో, రద్దీగా ఉండే ట్రంక్‌రోడ్‌లో జనం వచ్చే జనం, పోయే జనం పోగుకావడంతో సభ వద్దకు చంద్రబాబు వచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే జనం పొలోమని వెళ్లిపోవడంతో అసహనంతో సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ప్రజాగళం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఆగ్రహంతో వెళ్లిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన నెలకొంది.  

మిత్రపక్షాలకు దక్కని ప్రాధాన్యం  
టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులను కూడా కావ్య కృష్ణారెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రజాగళం సభలో జనసేన ఊసే లేకపోవడంతో పవన్‌ అభిమానులకు మింగుడు పడటం లేదు. బీజేపీ నాయకులను కూడా  పట్టించుకోలేదు. కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడి సహా సీనియర్‌ నాయకులంతా కూడా ప్రజాగళంలో జనాల మధ్య సాధారణ కార్యకర్తల్లా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు కూడా కావ్యకు మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.   

దొంగల్లా చూస్తున్నారని...  
40 ఏళ్ల నుంచి పార్టీ కోసమే పని చేస్తున్నాం. పైసా ఆశించకుండా అభిమానంతో పార్టీ జెండా మోస్తున్నాం. కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి మమ్మల్ని దొంగల్లా చూస్తున్నాడు. ప్రచార ఖర్చులకు అడిగినా కూడా అనుమానిస్తూ తన గుమాస్తాలకు లెక్కలు చెప్పమంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు. ఇలాంటి అనుమానపు వ్యక్తి ఉన్న పారీ్టలో కొనసాగడం మా వల్ల కాదంటూ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నందమూరి అభిమానులు, సీనియర్‌ నాయకులు పారీ్టకి, కావ్యకు దండం పెట్టి వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొంత మంది సీనియర్‌ నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement